APPSC : ఏపీలో గ్రూప్-2 పరీక్షల తుది ఎంపిక జాబితా వచ్చేసింది.. ఎంత మంది సెలక్ట్ అయ్యారంటే?
APPSC : మొత్తం 905 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయగా.. ప్రస్తుతం 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెల్లడించింది.
APPSC
- ఏపీపీఎస్సీ గ్రూప్-2 తుది ఎంపిక జాబితా విడుదల
- మొత్తం 905 పోస్టులకుగాను 891 మంది ఎంపిక
- కోర్టు ఆదేశాలతో రెండు క్రీడా కోటా పోస్టులు రిజర్వ్
- హారిజంటల్ రిజర్వేషన్‌తో 25 పోస్టుల్లో మార్పులకు అవకాశం
- న్యాయస్థానంలో కేసుల కారణంగా ఇన్నాళ్లు ఫలితాల్లో జాప్యం
APPSC : ఏపీలో గ్రూప్-2 పరీక్షల తుది ఎంపిక జాబితా వచ్చేసింది. మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జాబితాను విడుదల చేసింది. మొత్తం 905 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయగా.. ప్రస్తుతం 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెల్లడించింది. (APPSC Group 2 Final Results)
Also Read : Ysrcp: సీమలో బలమైన ఆ సామాజికవర్గాన్ని వైసీపీ అధిష్టానం ఎందుకు పట్టించుకోవడం లేదు?
గ్రూప్-2లో క్రీడా కోటాకు సంబంధించి రెండు పోస్టులను రిజర్వ్ చేయాలని గతంలో హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కోర్టును ఆశ్రయించిన అభ్యర్థులు ఇచ్చిన ఐచ్చికాల మేరకు ఎక్సైజ్ ఎస్ఐ, లా ఏఎస్ఓ పోస్టులను పక్కన పెట్టింది.
ప్రకటించిన 891 పోస్టుల్లో హైకోర్టు తీర్పును అనుసరించి, హారిజంటల్ రిజర్వేషన్ల కారణంగా 25 పోస్టుల్లో మార్పులు జరిగే అవకాశంముంది. మిగతా 866 పోస్టుల్లో ఏ మార్పూ ఉండదు. ఇంకా ప్రకటించని 14 పోస్టుల్లో, హైకోర్టు తీర్పుతో పక్కన పెట్టిన క్రీడా కోటా పోస్టులు రెండు పోనూ, ఏడు దివ్యాంగ, ఐదు రిజర్వేషన్ పోస్టులకు ఆయా కేటగిరీల్లో అభ్యర్థులు లేరు.
గ్రూప్-2లో 905 పోస్టుల భర్తీకి 2023 డిసెంబర్ 7వ తేదీన ఏపీపీఎస్సీ ప్రకటన జారీ చేసింది. అయితే, 2024 ఫిబ్రవరి 25న ప్రిలిమినరీ , 2025 ఫిబ్రవరి 23న మెయిన్ పరీక్షలు జరిగాయి. అదేఏడాది ఏప్రిల్ 4వ తేదీన ఫలితాలు వెల్లడించారు. అయితే, క్రీడా కోటాకు సంబంధించిన కేసు హైకోర్టులో పెండింగ్ లో ఉన్నందున అభ్యర్థుల ఎంపిక జాబితా తయారీకి ఇన్నాళ్లుగా సమయం పట్టింది.
