శ్రీవారి భక్తులకు బ్యాడ్ న్యూస్, తిరుపతిలో మరోసారి లాక్ డౌన్

చిత్తూరు జిల్లా తిరుపతిలో కరోనా వైరస్ ఉధృతి తీవ్రంగా ఉంది. తిరుపతిలో రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం అక్కడ కేసుల సంఖ్య 2వేల 200 దాటింది. దీంతో తిరుపతిలో మరోసారి లాక్‌డౌన్‌ను విధిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా ప్రకటించారు. నిబంధనలను మరింత కఠినంగా అమలు చేస్తామన్నారు. మంగళవారం(జూలై 21,2020) నుంచి సంపూర్ణ ఆంక్షలు విధిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. మంగళవారం నుంచి అత్యవసర సేవలు, మెడికల్ షాపులు మినహా మిగతా షాపులు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. ఆ తర్వాత వాహనాలను కూడా అనుమతించమన్నారు. ఈ ఆంక్షలు ఆగస్టు 5వరకు అమల్లో ఉంటాయన్నారు.
మొత్తం 50 డివిజన్లలో 48 డివిజన్లను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించగా… ఈ జోన్లలో ఉదయం ఆరు నుంచి 11 గంటల వరకు మాత్రమే షాపులకు అనుమతి ఇచ్చారు. 11 తర్వాత అత్యవసరం అయితే తప్ప ప్రజలెవరు రోడ్ల మీదికి రావొద్దని పోలీసులు సూచించారు. మరోవైపు తిరుమల దర్శనాలకు వెళ్లే వాహనాలకు నగరంలోని బైపాస్ రోడ్డు నుంచి పోలీసులు అనుమతిని ఇస్తున్నారు.
ఇక తిరుపతిలో ఆంక్షల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవారి సర్వ దర్శన టైమ్ స్లాట్ టోకెన్ల జారీని టీటీడీ తాత్కాలికంగా నిలిపివేసింది. అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌లో ఆఫ్‌లైన్ ద్వారా జారీ చేస్తున్న 3వేల శ్రీవారి సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లను మంగళవారం నుంచి తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు టీటీడీ ప్రకటనలో తెలిపింది. మళ్లీ టోకెన్లను ఎప్పుడు జారీ చేసేది త్వరలోనే చెబుతామని.. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ కోరింది.