బ్యాంకు లూటీలకు యత్నించిన చోర శిఖామణులు

కృష్ణా జిల్లా నూజివీడు లోని కరూర్ వైశ్యా బ్యాంకు ఏటీఎంలో ఓ దుండగుడు చోరీకి యత్నం చేసాడు. నూజివీడు పట్టణ పోలీసు స్టేషన్ దగ్గర ఉన్న శ్రీనివాస సెంటర్లోని కరూర్ వైశ్యా బ్యాంకు ఏటీఎంలోమంగళవారం రాత్రి చోరీకి దుండగుడు విఫలయత్నం చేశాడు. ఈ క్రమంలో ఏటీఎం మిషన్ పాక్షికంగా ద్వంసం అయ్యింది. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని సీసీ పుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
సంఘటనా స్థలాన్ని డిఎస్పీ బి.శ్రీనివాసులు,సిఐ పి. రామచంద్ర రావు,పట్టణ ఎస్ఐ బి. శ్రీనివాసరావు పరిశీలించి బ్యాంకు అధికారులను సంప్రదించారు. ఈ ఎటిఎం లో సీసీ ఫుటేజ్ మొత్తం కూడా హెడ్ ఆఫీస్ చెన్నై లో రికార్డు అవుతుందని త్వరలోనే సీసీ ఫుటేజ్ తెప్పించి ఇస్తామని నూజివీడు బ్రాంచ్ మేనేజర్ పోలీసులకు తెలిపారు.ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నూజివీడు పట్టణ ఎస్ఐ తెలిపారు.
మరోక ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. జిల్లాలోని పలమనేరు మండలం కొలమాసనపల్లెలో సప్తగిరి గ్రామీణ బ్యాంకు లో చోరీ చేసేందుకు మంగళవారం రాత్రి దోపిడీదొంగలు విఫల యత్నం చేశారు. దీనిని పసిగట్టిన స్దానికులు పోలీసులకు సమచారం ఇచ్చారు.
పోలీసులు బ్యాంకు వద్దకు రావటం గమనించిన దొంగలు పరారయ్యారు. బ్యాంకులో నగదు ఏమైనా పోయిందా ? లేదా ? అనే అంశంపై పోలీసులు, బ్యాంకు అధికారులతో విచారిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.