CM Jagan : సీఎం జగన్ కొత్త వ్యూహం ఫలిస్తుందా? మళ్లీ అధికారం దక్కుతుందా?

ఈ కొత్త వ్యూహం ఎంతవరకు ఫలిస్తుంది అనే అంశంపై రాజకీయవర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

CM Jagan : సీఎం జగన్ కొత్త వ్యూహం ఫలిస్తుందా? మళ్లీ అధికారం దక్కుతుందా?

CM Jagan Strategy

Updated On : December 13, 2023 / 11:03 PM IST

ఏపీలో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్న అధికార వైసీపీ ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్న కొందరిని వారి నియోజకవర్గాలను మార్చి మరో నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థిగా బరిలోకి దించాలని భావిస్తోంది. అందులో భాగంగానే ఇంఛార్జిల పేరుతో వారిని రంగంలోకి దించింది.

నియోజకవర్గం మార్పు వల్ల కొత్తగా నిలబడబోయే అభ్యర్థి నియోజకవర్గానికి కొత్తగా కనిపిస్తారని తద్వారా అభ్యర్థి మీద ప్రస్తుత నియోజకవర్గంలో వ్యక్తిగతంగా ఉన్న వ్యతిరేకతను నియోజకవర్గం మార్పు ద్వారా సరిదిద్ద వచ్చని వైసీపీ అధినాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త వ్యూహం ఎంతవరకు ఫలిస్తుంది అనే అంశంపై రాజకీయవర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

గుంటూరు జిల్లా నుంచి మంత్రులుగా ప్రస్తుతం పని చేస్తున్న వారితో పాటు మాజీ మంత్రులను సొంత నియోజకవర్గాల నుంచి తప్పించి కొత్త నియోజకవర్గాలకు ఇంఛార్జిలుగా నియమించింది వైసీపీ. ఇలా నియమించిన వారంతా దాదాపు తమ సొంత నియోజకవర్గాల్లో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న వారే. అలాంటి వ్యతిరేకత ఎదుర్కొంటున్న వారిలో ముందున్న నేత విడుదల రజినీ. ఆరోగ్యశాఖ మంత్రిగా సోషల్ మీడియాలో రజినీకి ఎంత గుర్తింపు ఉందో ఆమె సొంతం నియోజకవర్గం చిలకలూరిపేటలో అంతేస్థాయిలో వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు.

Also Read : ఏపీ రాజకీయాల్లో సంచలనం..! టీడీపీతో టచ్‌లోకి వచ్చిన ప్రశాంత్ కిశోర్..!

ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ తో పాటు నియోజకవర్గంలోని ముఖ్య నేతలంతా మంత్రి రజినీకి వ్యతిరేకంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. దీంతోనే మంత్రికి స్థానం చలనం కల్పించారు సీఎం జగన్. మంత్రి కొత్తగా ఇంఛార్జి బాధ్యతలు స్వీకరిస్తున్న గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఆమె ఎంతవరకు నెగ్గురు రాగలరు? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

ఐదేళ్ల పాటు ప్రాతినిధ్యం వహించిన చిలకలూరిపేటలో సానుకూలత సాధించుకోలేని మంత్రి రజినీ మరో నాలుగు నెలల్లో జరిగే ఎన్నికల్లో ఎలా గట్టెక్కగలరు? అనే ప్రశ్న తలెత్తుతోంది.

మాజీ మంత్రి సుచరితది కూడా ఇదే పరిస్థితి. గత ఎన్నికల్లో ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి గెలిచిన సుచరిత సీఎం జగన్ మంత్రివర్గంలో హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే, రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గ విస్తరణలో ఆమె తన పదవిని కోల్పోయారు. అప్పటి నుంచి నియోజకవర్గానికి ప్రజలకు దూరంగా ఉంటున్న సుచరితపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని చెబుతున్నారు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆమెను రాజధాని పరిధిలోని నియోజకవర్గం తాడికొండకు మార్చారు సీఎం జగన్.

Also Read : సీఎం జగన్ సంచలన నిర్ణయం, వైసీపీలో భారీ మార్పులు

రాజధాని ఉద్యమం బలంగా ఉన్న తాడికొండలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పార్టీ నుంచి వెళ్లిపోవడంతో సుచరితను అక్కడికి మార్చాల్సి వచ్చింది. హోంమంత్రిగా రాజధాని ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేసిన సుచరిత ఇప్పుడు ఇక్కడ సానుకూలత సాధించుకోవడం కత్తి మీద సామే అంటున్నారు.