AP High Court : కొడాలి నాని, వైసీపీ నేతలకు హైకోర్టులో బిగ్ రిలీఫ్.. నెల రోజులకు విచారణ వాయిదా..!
AP High Court : కొడాలి నాని, తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి వైసీపీ నేతలకు బిగ్ రిలీఫ్.. వీరిపై పోలీసుల చర్యలపై కోర్టు స్టే విధించింది.

AP High Court
AP High Court : వైసీపీ నేతలకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట దక్కింది. తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, కొడాలి నాని, తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డికి ఉపశమనం లభించింది. వైసీపీ నేతలకు సంబంధించి వేర్వేరు కేసుల్లో హైకోర్టులో విచారణ జరిగింది.
ఈ విచారణ సందర్భంగా ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులో తదుపరి చర్యలను నిలుపుదల చేసింది. పోలీసులపై కొడాలి నాని అనుచిత వ్యాఖ్యల కేసులో తదుపరి చర్యలపై కూడా హైకోర్టు స్టే విధించింది.
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించి గుంటూరు మిర్చియార్డ్ వెళ్లిన వ్యవహారంలో వైసీపీ ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డిపై కేసులు నమోదయ్యాయి. నల్లపాడు పోలీసులు నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలు అన్నింటినీ ఏపీ హైకోర్టు నిలుపుదల చేసింది.
తదుపరి విచారణ నెలరోజుల పాటు వాయిదా వేసింది. అలాగే, మచిలీపట్నంలో నమోదైన కేసులో ఆయనపై తదుపరి చర్యలన్నీ నిలుపుదల చేసింది. ఈ కేసు విచారణను కూడా నెల రోజులకు వాయిదా వేసింది.
అప్పటివరకు మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. వైసీపీనేత తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశించింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సత్య సాయి జిల్లా పర్యటన సందర్భంగా పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లు తోసేసిన ఘటనలో తోపుదుర్తిపై కేసు నమోదైంది. పోలీసు విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే కేసులో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాల్లో పేర్కొంది.