దడపుట్టిస్తున్న బర్డ్ ఫ్లూ.. ఏలూరు జిల్లాలో మనిషికి సోకిన వైరస్.. అప్రమత్తమైన అధికారులు
తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలను బర్డ్ ఫ్లూ వైరస్ భయాందోళనకు గురిచేస్తోంది. తాజాగా ఏలూరు జిల్లాలో ఓ వ్యక్తికి బర్డ్ ప్లూ సోకినట్లు వైద్యులు నిర్దారించారు.

Bird Flu
Bird Flu Virus: తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలను బర్డ్ ఫ్లూ వైరస్ భయాందోళనకు గురిచేస్తోంది. ఏపీలోని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో బర్డ్ ప్లూ సోకి లక్షలాది కోళ్లు మరణించినట్లు అధికారులు గుర్తించారు. దీంతో బర్డ్ ప్లూ సోకిన కోళ్ల ఫామ్ ప్రాంతాల్లో అలర్ట్ ప్రకటించారు. పరిసర ప్రాంతాల్లోకి ఎవరూ వెళ్లకుండా చర్యలు చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం అనుమ్మోలంకలోని ఓ ఫౌల్ట్రీ ఫామ్ లో కూడా మూడు రోజుల్లో వేలాది కోళ్లు మృతిచెందినట్లు అధికారులు గుర్తించారు. ఏపీలో బర్డ్ ప్లూ నేపథ్యంలో మంత్రి అచ్చెన్నాయుడు పశుసంవర్దక శాఖ ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో వెటర్నరీ వైద్యులు అందుబాటులో ఉండాలని, చనిపోయిన కోళ్లను పరిశీలించి శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపించాలని ఆదేశించారు. అన్ని జిల్లాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, పౌల్ట్రీల వద్ద బయో సెక్యూరిటీ మెజర్స్ అమలు చేయాలని సూచించారు.
Also Read: Bird flu: ఆ ఒక్క ప్రాంతంలో 4 లక్షలకు పైగా కోళ్లు మృతి.. తెలుగు రాష్ట్రాల్లో పడిపోయిన చికెన్ ధరలు
ఏపీలో బర్డ్ ప్లూ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. దీంతో రాష్ట్రం నుంచి వస్తున్న కోళ్ల వాహనాలను అనుమతించవద్దని పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సరిహద్దుల్లో చెక్ పోస్టులను అధికారులు ఏర్పాటు చేశారు. బర్డ్ ప్లూ పై పౌల్ట్రీ రైతులకు పశుసంవర్ధక శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. కోళ్లు చనిపోతే వెంటనే తమకు తెలియజేయాలని సూచించారు. అయితే, ఏపీలో ఓ వ్యక్తికి కూడా బర్డ్ ప్లూ సోకినట్లు తెలుస్తోంది. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలంలో ఓ వ్యక్తికి బర్డ్ ప్లూ సోకినట్లు నిర్ధారణ కావడంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు.
Also Read: Burd flu: బర్డ్ ఫ్లూ టైమ్‌లో కూడా చికెన్ తినాలంటే ఇలా చేయండి..
కోళ్ల ఫారం సమీపంలోని ఒక వ్యక్తికి బర్డ్ ప్లూ లక్షణాలు ఉండటంతో శాంపిల్స్ అధికారులు సేకరించారు. దీంతో అతనికి బర్డ్ ఫ్లూగా నిర్ధారణ కావడంతో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ఆ ప్రాంతాని అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ విషయంపై జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ మాలిని మాట్లాడుతూ.. బర్డ్ ప్లూ తొలికేసు నమోదైందని తెలిపారు. కేసు నమోదైన ప్రాంతంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. బర్డ్ ప్లూ సోకిన వారికి చికిత్స అందించేందుకు అన్నిచర్యలు తీసుకున్నామని, బర్డ్ ప్లూ పట్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మాలిని పేర్కొన్నారు.