Bird flu: ఆ ఒక్క ప్రాంతంలో 4 లక్షలకు పైగా కోళ్లు మృతి.. తెలుగు రాష్ట్రాల్లో పడిపోయిన చికెన్ ధరలు
ఏపీ నుంచి కోళ్లు, గుడ్లు రాకుండా ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపడుతున్నారు.

బర్డ్ ఫ్లూ దెబ్బకు పౌల్ట్రీ రంగం కుదేలైంది. ఆంధ్రప్రదేశ్‌లో బర్డ్ ఫ్లూతో తెలంగాణ అధికారులు అప్రమత్తమయ్యారు. ఖమ్మం జిల్లాలో అధికారులు పలు చర్యలు తీసుకుంటున్నారు.
ఇప్పటికే వైరస్‌తో సత్తుపల్లి నియోజకవర్గంలో నాలుగు లక్షలకు పైగా కోళ్లు మృతి చెందాయి. సత్తుపల్లి, పెనుబల్లి, కల్లూరు మండలాల్లో కోళ్లఫాంలు మూతబడ్డాయి. కల్లూరు మండలం పేరువంచలో కోళ్ల ఫాంలను జిల్లా పశువైద్యాధికారి, తహసీల్దార్ పరిశీలించారు.
వాతావరణం పరిస్థితుల ప్రభావంతో ఫామ్ కోళ్లు చనిపోతున్నాయని పశుసంవర్ధక శాఖ జేడీ అన్నారు. ముత్తుగూడెం చెక్ పోస్ట్ ను కూడా జిల్లా పశువైద్యశాఖ అధికారి తనిఖీ చేశారు.
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు, గంపలగూడెం మండలాల్లో బర్డ్ ఫ్లూతో కోళ్లు మృత్యువాత పడ్డ విషయం తెలిసిందే. దీంతో ఆంధ్ర, తెలంగాణ సరిహద్దులో ముత్తగూడెం వద్ద చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. ఆంధ్ర నుంచి కోళ్లు, గుడ్లు రాకుండా ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపడుతున్నారు.
చికెన్ తినాలని అనుకుంటున్న వారు దాన్ని బాగా ఉడికించాకే తినాలని నిపుణులు సూచిస్తున్నారు. వైరస్ మనుషులకు సోకకుండా జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. ఇప్పటికే చికెన్ రేట్లు భారీగా పడిపోయాయి. ఏపీలోని పలు ప్రాంతాల్లో రూ.30కే కిలో చికెన్ అమ్ముతున్నప్పటికీ కొనడానికి ఎవరూ ముందుకు రావట్లేదు.