ఆపద్భాందవుడు : జగన్‌కు జీవీఎల్‌కు ఉన్న సంబంధం ఏంటీ?

ఏపీలో విచిత్రమైన రాజకీయాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఎవరు ఎవరికి మద్దతుగా నిలుస్తున్నారో? ఎవరెవరికి వైరం ఉందో అంత ఈజీగా అర్థం కాని పరిస్థితులున్నాయి. తన నిర్ణయాలతో దూకుడుగా ముందుకెళ్లేందుకు ముఖ్యమంత్రి జగన్ ప్రయత్నిస్తున్నారు. ఆయన నిర్ణయాలను వ్యతిరేకిస్తూ పై చేయి సాధించేందుకు ప్రతిపక్ష పార్టీ టీడీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. రాజకీయంగా జగన్ ఇరుకున పడిన ప్రతీసారి టైమ్ చూసుకొని ఎంటరైపోతున్నారట బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. నిజానికి ఆయనకు ఏపీ రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదు. ఆయన రాజ్యసభకు ఎంపికైంది కూడా వేరే రాష్ట్రం నుంచి. కానీ, తెలుగు వ్యక్తి కావడంతో ఇక్కడ తన ప్రతాపం చూపించేందుకు ప్రయత్నిస్తున్నారని జనాలు అంటున్నారు.
సీఎం జగన్ ప్రతిపక్షాల ఉచ్చులో పడి కాస్త ఇబ్బంది పడుతున్నారని అనిపించగానే జీవీఎల్ ప్రత్యక్షమైపోయి మీడియా సమావేశాలు పెడుతున్నారని అనుకుంటున్నారు. ఆయన చేసే ప్రతీ వ్యాఖ్య జగన్‌ను పరోక్షంగా వెనకేసుకొచ్చేలా ఉంటున్నాయి. ఇక చంద్రబాబుపై విమర్శల సంగతి చెప్పాల్సిన పని లేదు. ఆయన అదే పనిగా పెట్టుకున్నట్టుగా కనిపిస్తోందని టీడీపీ వాళ్లే కాదు… బీజేపీలోని వారు కూడా కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. గతంలో ఎన్నోసార్లు జగన్‌ను రక్షించడానికి వచ్చినట్టుగానే తాజాగా కూడా జీవీఎల్ నరసింహారావు రంగంలోకి దిగారు.
చంద్రబాబు విశాఖ పర్యటనను వైసీపీ నేతలు, కార్యకర్తలు విమానాశ్రయంలోనే అడ్డుకున్నారు. ఈ విషయంలో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. చంద్రబాబును అడ్డగించిన వారిని నిలువరించాల్సిన పోలీసులు.. బాబును ఇబ్బంది పెట్టారని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ వ్యవహారంలో హైకోర్ట్ కూడా సీరియస్ అయింది. దీంతో ప్రభుత్వానికి, వైసీపీకి మరింతగా ఇబ్బందిగా మారింది. ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడితే.. వైసీపీ ప్రతిష్ట మరింత దిగజారకుండా ఉండేందుకా అన్నట్టు జీవీఎల్ రంగంలోకి దిగారట. ఆయన మీడియా ముందుకి వచ్చి చంద్రబాబును, నాటి ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసిన కార్యక్రమాలను విమర్శించటం మొదలుపెట్టారు.
ఒక పక్క విష్ణుకుమార్‌రాజు లాంటి బీజేపీ స్థానిక నాయకులు.. చంద్రబాబును జనం అడ్డుకోలేదని చెబుతున్నా.. జీవీఎల్ మాత్రం చంద్రబాబే ఆ దాడులకు కారణమని చెప్పడం విడ్డూరంగా ఉందని జనాలు అంటున్నారు. యథావిధిగా చంద్రబాబును తిడుతూ తన మీడియా సమావేశాన్ని కొనసాగించారాయన. కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ఓ పక్క జగన్ సర్కారు తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో దేశమే నష్టపోయిందని పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు జగన్‌ను ఇబ్బందుల్లోకి నెట్టాయి. కానీ, ఆ తర్వాత రోజు మీడియా సమావేశం పెట్టిన జీవీఎల్ ఆ విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు.
సీఎం తీసుకునే నిర్ణయాలను ఎవరూ ప్రశ్నించజాలరని, అయినా దీనికంతటికీ చంద్రబాబే కారణమంటూ తనదైన శైలిలో రెచ్చిపోయారు. ఇది చూసిన జనాలు ఇదెక్కడి విడ్డూరం జీవీఎల్ అని ముక్కున వేలేసుకుంటున్నారు. దేశంలో ఎక్కడైనా అధికార పక్ష నాయకులు ప్రతిపక్షాన్ని విమర్శిస్తారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు అధికార పక్షాన్ని టార్గెట్ చేసి మాట్లాడతారు. కానీ, ఇక్కడ మాత్రం ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు, మరో ప్రతిపక్ష నాయకుడిని విమర్శించడం చూసిన జనాలు విస్తుపోతున్నారు.
రాజధాని విషయంలో కూడా జీవీఎల్ ఇదే విధంగా కొన్ని వ్యాఖ్యలు చేసి ఆశ్చర్యానికి గురి చేశారు. గత ఎన్నికలకు ముందు కూడా జనసేన అధినేత తన ఎన్నికల ప్రచారంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం కంటే కూడా ప్రతిపక్షంలో ఉన్న వైసీపీని టార్గెట్ చేయడం విమర్శల పాలైంది. ఇప్పుడు జీవీఎల్ కూడా అలాంటి పాత్రే పోషిస్తుండడంతో బీజేపీ రాష్ట్ర నేతలకు ఏం చేయాలో అసలు పాలుపోవడం లేదంట. అసలు జీవీఎల్… తనంతట తానే ఇలా మాట్లాడుతున్నారా? కేంద్ర పెద్దల సలహాలతో వ్యవహరిస్తున్నారా అన్నది అంతు చిక్కడం లేదంటున్నారు.
Read More :ఆకాశవాణి మాజీ న్యూస్ రీడర్ మాడపాటి సత్యవతి కన్నుమూత..సీఎం కేసీఆర్ సంతాపం