Chalo Amalapuram: ఛలో అమలాపురం.. రైల్వేలైన్ నిధుల కోసం బీజేపీ డిమాండ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా సమస్యలపై జగన్ ప్రభుత్వాన్ని నిలదీసే ఉద్ధేశ్యంతో ఇవాళ(24 ఫిబ్రవరి 2022) బీజేపీ ఛలో అమలాపురం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

Ap Bjp
Chalo Amalapuram: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా సమస్యలపై జగన్ ప్రభుత్వాన్ని నిలదీసే ఉద్ధేశ్యంతో ఇవాళ(24 ఫిబ్రవరి 2022) బీజేపీ ఛలో అమలాపురం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం కోసం ఎన్నో ప్రాజెక్టులను ఇస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను మాత్రం ఇవ్వకుండా కేంద్రం ఇస్తున్న ప్రాజెక్టులను నీరుగారుస్తుందని ఆంధ్రా బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఈ క్రమంలోనే రైల్వే లైన్ విషయంలో జగన్ సర్కార్‌పై ఒత్తిడి పెంచేందుకు బీజేపీ ఛలో అమలాపురం కార్యక్రమం నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన నిధులను, చెల్లించాల్సిన బకాయిలను కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదని వైసీపీ ఎంపీలు చెబుతుంటే, కేంద్రం ప్రాజెక్టులకు రాష్ట్ర వాటా నిధులను ఇవ్వట్లేదని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అసలే ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకున్న జగన్ సర్కార్‌పై ఒత్తిడి పెంచే వ్యూహం రచిస్తోంది.
ఇందులో భాగంగా కోటిపల్లి నరసాపురం రైల్వేలైన్‌పై రాష్ట్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా ఛలో అమలాపురం కార్యక్రమం నిర్వహిస్తోంది. కోనసీమ రైల్వేలైన్‌కు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన 25 శాతం వాటా నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. మహాధర్నాకు హాజరు కానున్నారు బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎంపీ జీవిఎల్ నరసింహారావు. రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.350 కోట్లు విడుదల చేయాలని బీజేపీ చెబుతోంది. 52కిలోమీటర్ల కోటిపల్లి-నరసాపురం రైల్వే లైన్ నిర్మాణానికి 2012 కోట్ల రూపాయల అంచనా వేస్తుంది ప్రభుత్వం.
ఈ రైల్వేలైన్ పూర్తయితే ఉభయగోదావరి జిల్లాలకు ఎంతో మేలు జరుగుతుంది. రాష్ట్రం తమ వంతు నిధులు ఇవ్వకపోవటం వల్లే ఈ పనులు నిలిచిపోయాయని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది.