BJP Yuva morcha: ఏపీపీఎస్సి కార్యాలయాన్ని ముట్టడించిన బీజేపీ యువ మోర్చా: పరిస్థితి ఉద్రిక్తం
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు ఏపీపీఎస్సి ద్వారా వెంటనే ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయాలనీ బీజేపీ యువ మోర్చా నేతలు డిమాండ్ చేశారు.

Appsc
BJP Yuva morcha: ఆంధ్రప్రదేశ్ లో జాబ్ క్యాలండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో శుక్రవారం విజయవాడలోని ఎపిపిఎస్సీ కార్యాలయాన్ని బీజేపీ యువ మోర్చా నేతలు ముట్టడించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు ఏపీపీఎస్సి ద్వారా వెంటనే ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయాలనీ బీజేపీ యువ మోర్చా నేతలు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే విజయవాడలోని ఏపీపీఎస్సి కార్యాలయాన్ని ముట్టడించారు. ఎపిపిఎస్సి కార్యాలయం ముట్టడికి బీజేపీ యువ మోర్చా నేతలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. కార్యాలయం లోపలికి చొచ్చుకెళుతుండగా నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. ఈక్రమంలో పోలీసులకు, యువ మోర్చా నేతల మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకుంది.
బీజేవైఎం నేతలను అరెస్టు చేసిన పోలీసులు వారిని స్టేషన్ కు తరలించారు. అయితే కొందరు బీజేవైఎం నేతలు మార్గం మధ్యలో పోలీస్ వ్యాన్ లోంచి కిందకు దూకారు. పోలీసుల అక్రమ అరెస్టును ఖండించిన నేతలు, పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జాబ్ క్యాలెండర్ కు నోటిఫికేషన్ ఇవ్వమంటే అరెస్టు చేయడం దుర్మార్గమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులు తిండీ తిప్పలు లేక అల్లాడిపోతున్నారని, సిఎం జగన్ వెంటనే రాష్ట్రంలో ఖాళిగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని బీజేవైఎం నేతలు హెచ్చరించారు.