Bonda Uma: విజయవాడ జిల్లాకి ‘వంగవీటి’ పేరు పెట్టాల్సిందే.. బోండా ఉమా డిమాండ్!
కృష్ణా జిల్లాను రెండుగా విభజిస్తుండగా.. జిల్లా కేంద్రమైన విజయవాడకు వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలని బోండా ఉమ అభిప్రాయపడ్డారు.

Bonda Uma
Bonda Uma: కృష్ణా జిల్లాను రెండుగా విభజిస్తుండగా.. జిల్లా కేంద్రమైన విజయవాడకు వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలని బోండా ఉమ అభిప్రాయపడ్డారు. అన్ని ప్రాంతాలవారు రంగాకు విగ్రహాలు పెట్టి పూజిస్తారని, ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు.. రెండో జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలని డిమాండ్ చేశారు.
విజయవాడ జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాల రేపు(9 ఫిబ్రవరి 2022) ధర్నా చౌక్ వద్ద వేలాది మందితో ఆందోళన చేయనున్నట్టు ప్రకటించారు బోండా ఉమ. అవసరమైతే సీఎం ఇల్లు ముట్టడికి కూడా సిద్ధమని అన్నారు. వంగవీటి మోహనరంగా విగ్రహం లేని ప్రాంతం లేదని, రంగా వంటి మహానేత పేరు పెట్టకపోతే సీఎం వైఎస్ జగన్ ఆయన్ని అవమానించినట్లేనని అన్నారు.
రంగా ఒక కుటుంబానికో ఒక కులానికో ఓ మతానికి సంబంధించిన చెందిన వ్యక్తి కాదు, ఆయన అన్నివర్గాల ప్రజల మనిషియని, అందరికీ ఆరాధ్య నాయకులు అన్నారు. తూర్పు కృష్ణాకు ఎన్టీఆర్ పేరు, విజయవాడకు వంగవీటి మోహనరంగా పేరు పెట్టాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ విషయంపై పది రోజుల నుంచి అడుగుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నారు.
ఇదే సమయంలో వంగవీటి రాధాపై కూడా వ్యంగ్యాస్త్రాలు సంధించారు బోండా ఉమ. రంగా కుటుంబ సభ్యులు కూడా వారి సన్నిహితులైన కొడాలి నాని, వంశీమోహన్ ద్వారా ఈ జిల్లాకు రంగా పేరు పెట్టాలని ప్రయత్నిస్తున్నారేమో అంటూ సెటైర్లు వైశారు.
రాధాకు వంశీ, కొడాలి నానితో మంచి సంబంధాలు ఉన్నాయి. ఓ ఫోన్ కాల్ ద్వారా, లేదా మెసేజ్ ద్వారాగాని ఏమైన ప్రయత్నాలు చేస్తున్నారేమో..? అని అన్నారు. డిసెంబర్ 26న రంగా వర్థంతి సందర్భంగా రంగా విగ్రహావిష్కరణలోనూ వల్లభనేని వంశీ, మంత్రి కొడాలి నాని పాల్గొన్న సంగతి తెలిసిందే.
వంగవీటి రాధాకృష్ణను తమ దీక్షకు ఆహ్వానించాలని అనుకున్నామని, కానీ, ప్రస్తుతం రాధ అందుబాటులో లేరని, మీడియా ద్వారా ఆయన్ను ఈ దీక్షకు ఆహ్వానిస్తున్నామని అన్నారు.