Free gas cylinder: సమయం లేదు మిత్రమా.. ఉచిత గ్యాస్ సిలిండర్ కోసం బుక్ చేసుకున్నారా?
ఆ తర్వాత సిలిండర్ డెలివరీ అయిన 48 గంటల్లోపు లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బు తిరిగి జమ అవుతుందని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌లో తొలి ఉచిత గ్యాస్ సిలిండర్ పొందేందుకు మార్చి 31 వరకే అవకాశం ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఇప్పటివరకు ఉచిత గ్యాస్ సిలిండర్ పొందని వారు వెంటనే బుక్ చేసుకోవాలని చెప్పారు. ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలెండర్లను ఇస్తామన్న హామీని కూటమి సర్కారు నిలబెట్టుకుందని అన్నారు.
ఏపీలో ఇప్పటికే 98 లక్షల మంది తొలి ఉచిత సిలిండర్ వినియోగించుకున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో 2024 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి చేతుల మీదుగా దీపం 2 పథకానికి శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీపం-2 పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా రూపొందించాయన్నారు.
దీపం-2 పథకానికి రూ.2,684 కోట్లను కూటమి ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. ఉచిత సిలిండర్ కావాల్సిన వారు సాధారణ పద్ధతిలో ముందుగా సొమ్ము చెల్లించవలసి ఉంటుందని అన్నారు. పట్టణ ప్రాంతాల్లో బుక్ చేసిన 24 గంటల లోపు, గ్రామీణ ప్రాంతాల్లో 48 గంటల లోపు గ్యాస్ డెలివరీ ఇస్తారని తెలిపారు.
ఆ తర్వాత సిలిండర్ డెలివరీ అయిన 48 గంటల్లోపు లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బు తిరిగి జమ అవుతుందని చెప్పారు. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇలా ఉచితంగా పంపిణీ చేస్తారన్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్ పొందడానికి ఎల్‌పీజీ కనెక్షన్ ఉండాలి, రైస్ కార్డ్, ఆధార్ కార్డు, అలాగే, ఆధార్ కార్డుతో రైస్ కార్డుతో అనుసంధానం అయి ఉండాలి.