విజయనగరంలో బొత్స మాస్టర్‌ ప్లాన్‌!

  • Published By: sreehari ,Published On : January 16, 2020 / 02:13 PM IST
విజయనగరంలో బొత్స మాస్టర్‌ ప్లాన్‌!

Updated On : January 16, 2020 / 2:13 PM IST

విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ స్థానం రిజర్వేషన్ సడన్‌గా మారిపోయింది. అధికారం మనదైతే ఏమైనా చేయొచ్చని నిరూపించారు జిల్లాకు చెందిన కీలక నేత. ముందు ఒకటి ప్రకటించగా తర్వాత మరొకటిగా మార్పు చేశారు. తొలుత ఎస్సీ మహిళకు కేటాయించారు. గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చేశారు. దీంతో అన్ని పార్టీల్లో ఆశావహులు ఎవరి ప్రయత్నంలో వారు మునిగిపోయారు.

సురక్షిత స్థానాన్ని ఎంపిక చేసుకొని అధినాయకుల ఆశీస్సులు తీసుకున్నారు. పదవిపై గంపెడాశలు పెట్టుకున్నారు. ఇంతలో వారికి షాక్ తగిలింది. జడ్పీ అధ్యక్ష స్థానాన్ని జనరల్‌కు కేటాయిస్తూ మరోసారి ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా జడ్పీ స్థానాన్ని జనరల్‌కు బదులు ఎస్సీ మహిళకు మార్చగా… విజయనగరంలో ఎస్సీ మహిళ నుంచి జనరల్‌కు మార్చారు. దీంతో ఇది రెండు జిల్లాలపై ప్రభావం చూపింది. 

ఈ వ్యవహారంలో రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ హస్తం ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ అనూహ్య మార్పు ఇప్పుడు చర్చనీయాంశమైంది. తొలుత వచ్చిన నోటిఫికేషన్‌లో జడ్పీ స్థానాన్ని ఎస్సీ మహిళకు కేటాయించడంతో అధికార పార్టీలో ఒకింత అసంతృప్తి వ్యక్తమైంది. ఇప్పటికే ఈ సీటుపై బొత్స కుటుంబం చాలా ఆశలు పెట్టుకుందంటూ కొన్ని రోజులుగా హాట్ హాట్‌ టాపిక్ నడుస్తోంది. బొత్స మేనల్లుడు చిన్న శ్రీను గానీ, బొత్స సతీమణి ఝాన్సీలక్ష్మికి గానీ దక్కేలా ఈ సీటును ముందుగానే కర్చీఫ్ వేసేశారట. 

జడ్పీ పీఠంపైనే దృష్టి :
బొత్స ఝాన్సీకి గతంలో జడ్పీ చైర్ పర్సన్‌గా పని చేసిన అనుభవం ఉంది. అయితే, గత సార్వత్రిక ఎన్నికల్లో ఆమెకు సీటు రాకపోవడంతో బొత్స కుటుంబం కొంత నిరాశకు గురైంది. ఎలాగైనా సరే ఆమెకు ఏదో ఒక పదవి కట్టబెట్టాలన్న ఉద్దేశంతో అప్పటి నుంచి మంత్రి బొత్స పావులు కదుపుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బొత్స ఫ్యామిలీ దృష్టి జడ్పీ పీఠంపై పడిందట. జడ్పీ బెర్తు తమ చేతిలో ఉంటే… జిల్లాలో చక్రం తిప్పవచ్చన్న ఉద్దేశంతో ఎప్పటి నుంచో ఆ సీటుపై కన్నేశారని అంటున్నారు. 

మరోపక్క, బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు కూడా జడ్పీ అధ్యక్ష పదవిపై ఆశలు పెట్టుకున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది. గత ఎన్నికల్లో ఆయనకు ఎస్.కోట సీటు ఆఫర్ వచ్చినా తిరస్కరించారు. ఈ నేపథ్యంలోనే అధిష్టానం ఆయన పట్ల సానుకూలంగా ఉంది. ఆయన ఏదో ఒక పదవిలో ఉండటం కంటే ఇప్పటిలా పార్టీ నేతగానే ఉంటారన్న చర్చ నడుస్తున్నా… ఇటీవల కాలంలో ఆయన కూడా జడ్పీ పీఠంపై దృష్టి పెట్టారంటుని పార్టీలో కార్యకర్తలు అంటున్నారు. 

ఈ విధంగా బొత్స కుటుంబంలో ఇద్దరు నేతలు ఈ పీఠంపై కన్నేసిన పరిస్థితుల్లో ఎస్సీ మహిళకు ఈ సీటు రిజర్వుడు కావడంతో ఒక్కసారిగా షాకయ్యారు. ఇలా అయితే తమ ఆశలకు గండి కొట్టినట్లవుతుందని మంత్రి బొత్స రాష్ట్ర స్థాయిలో చక్రం తిప్పి తమకు అనుకూలంగా మళ్లీ జనరల్‌గా మార్పు చేసుకున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మరి బొత్స అనుకుంటున్నట్టుగా వారి కుటుంబానికే పీఠం దక్కుతుందో లేదో చూడాలి.