యాక్షన్ ప్లాన్‌ అమలు.. ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడితే అరెస్ట్!

అయితే సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడితే మాత్రం రాబోయే రోజుల్లో మరిన్ని అరెస్టులు తప్పవనే సంకేతాలను కిరణ్ అరెస్ట్ ద్వారా ఇచ్చిందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

యాక్షన్ ప్లాన్‌ అమలు.. ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడితే అరెస్ట్!

Updated On : April 11, 2025 / 8:32 PM IST

సోషల్ మీడియా సైకోలపై కూటమి సర్కార్ కొరఢా ఝళిపిస్తుందా? సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెట్టే సోషల్‌ సైకోలను వదిలే ప్రసక్తే లేదంటూ ఏపీ సర్కార్ సంకేతాలిస్తోందా? అసభ్యకర పోస్టులు పెట్టిన వారందరిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపబోతుందా? అది ప్రతిపక్ష వైసీపీ అయినా..లేదంటే సొంత పార్టీ వారైనా సరే…గీత దాటితే వేటేనా? కూటమి ప్రభుత్వం చర్యలతో సోషల్ సైకోల్లో వణుకు మొదలైందా? వాచ్ దిస్ స్టోరీ.

సోషల్ మీడియాలో మహిళలపై అసభ్యకర పోస్టులు పెట్టే వారిపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. నోటికి ఎంతొస్తే అంత అన్నట్లుగా..సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న సైకోగాళ్లపై ప్రభుత్వం కొరఢా ఝళిపిస్తోంది. అలాంటి వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ వారిని అరెస్ట్ చేస్తూ జైలుకు పంపిస్తోంది. ప్రతిపక్ష పార్టీనే కాదు..సొంత పార్టీ వారైనా సరే తాట తీస్తాం అంటూ అగ్గిమీద గుగ్గిలం అవుతోంది. కొద్ది రోజుల క్రితం టీడీపీ సోషల్ మీడియాలో పనిచేస్తున్న చేబ్రోలు కిరణ్..మహిళలపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టాడు.

దీంతో టీడీపీ అధిష్టానం ఫుల్ సీరియస్ అయిందట. ప్రతిపక్ష సభ్యులైనా..సొంత పార్టీవాళ్లైనా సరే సోషల్ మీడియాలో మహిళలపై అసభ్యకర పోస్టులు పెడితే ఊరుకునే ప్రసక్తే లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.మహిళలపై ఇష్టారాజ్యంగా పోస్టులు పెట్టిన టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త కిరణ్ ను పోస్టులు పెట్టిన 24 గంటల్లోనే అరెస్ట్ చేసి జైలుకు పంపింది. కిరణ్ అరెస్టుతో సోషల్ సైకోల వెన్నులో ఒక్కసారిగా వణుకు మొదలైందంట. గతంలో వైసీపీ అసభ్యకర వ్యాఖ్యలపై చర్యలు లేకపోయిన నేపథ్యంలో..ప్రస్తుతం కూటమి ప్రభుత్వం స్పష్టమైన సంకేతాలు పంపుతోంది

సోషల్‌ సైకోలు ఏ పార్టీలో ఉన్నా అణచివేయాలని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడమే కాదు..దాన్ని వెంటనే ఆచరణలో చేసి చూపించిందని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. గత వైసీపీ హయాంలో ప్రతిపక్ష టీడీపీని తిడితే పదవులు, తీవ్రంగా దూషిస్తే నజరానాలు, సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడితే ప్రభుత్వంలో ఛాన్స్‌ అంటూ జగన్‌ ఐదేళ్లూ అరాచక సంస్కృతిని పెంచి పోషించారని కొందరు రాజకీయ నేతలు చెప్తున్నారు.

సొంత పార్టీ కార్యకర్త చేబ్రోలు కిరణ్‌పై టీడీపీ వేటు
అయితే ఇలాంటి వాతావరణాన్ని ప్రక్షాళన చేయాల్సిందే అంటూ నిర్ణయించిన కూటమి ప్రభుత్వం వెంటనే యాక్షన్ ప్లాన్ ను అమలు చేసిందన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తోంది. అందులో భాగంగానే..ఇప్పుడు సొంత పార్టీ కార్యకర్త చేబ్రోలు కిరణ్‌పై టీడీపీ వేటు వేసిందట. ప్రముఖులపై వారి కుటుంబ సభ్యులు, మహిళలు, చిన్నారులపై సోషల్‌ మీడియాలో ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెట్టే సంస్కృతికి కూటమి ప్రభుత్వం తొలి నుంచీ వ్యతిరేకంగా ఉంది. దీనికోసం 2024 నవంబరులో ప్రత్యేక పోలీసు బృందాలను కూడా ఏర్పాటు చేసింది. వైసీపీ సోషల్‌ మీడియా యాక్టివిస్టులతోపాటు టీడీపీ, జనసేన కేడర్‌ పెట్టే పోస్టింగ్‌లపైనా ఈ బృందాలు సీరియస్ గా నిఘా పెట్టాయంట.

ప్రత్యర్థి పార్టీ నేతలపై దాడులకు తెగబడినవారికి..అసభ్యకరమైన రీతిలో దూషణలు చేసిన వారికి గత వైసీపీ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్న చర్చ రాజకీయవర్గాల్లో సాగింది. 2017లో వైసీపీ ప్లీనరీలో సభలో కొందరు వైసీపీ సీనియర్ నేతలు టీడీపీ అధినేత చంద్రబాబుపై ఇష్టం వచ్చినట్లు విధ్వేషపూరిత ప్రసంగాలు చేశారనే టాక్ నడిచింది. ప్రత్యర్థులపై అసభ్య పోస్టులు పెట్టేవారికి జీతాలిచ్చి ప్రోత్సహించిన గత వైసీపీ..2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత విద్వేష రాజకీయాల్లో మరింత దూకుడును ప్రదర్శించింది.

చంద్రబాబును అసభ్య పదజాలంతో దూషించిన కొందరు నేతలకు మంత్రి పదవులు సైతం దక్కాయట. వైసీపీ హయాంలో అప్పటి సోషల్ మీడియా యాక్టివిస్టులైన వర్రా రవీంద్ర రెడ్డి, ఇప్పాల రవీంద్రారెడ్డి, పంచ్‌ ప్రభాకర్‌, వంటి వారి ద్వారా టీడీపీ నేతలు, వారి కుటుంబ సభ్యులపై జుగుప్సాకరరీతిలో పోస్టులు పెట్టించేవారట. అయితే ఇలాంటి సంస్క్రుతికి చెక్ పెట్టాలని నిర్ణయించిన సీఎం చంద్రబాబు అలాంటి వారిపై తాట తీస్తాం అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

తప్పు ఎవరు చేసినా…అది విపక్షమైనా..స్వపక్షమైనా సరే అలాంటి వారికి శిక్ష తప్పదని కూటమి సర్కార్ హెచ్చరికలు జారీ చేస్తోందట. చేబ్రోలు కిరణ్‌ విషయంలో టీడీపీ అధిష్ఠానం స్పందించిన తీరుపై టీడీపీ శ్రేణుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోందట. తప్పు ఎవరు చేసినా తప్పేనంటూ అధిష్ఠానం చర్యను సమర్థిస్తూ కొందరు టీడీపీ కార్యకర్తలు పోస్టులు పెడుతున్నారంట.

మరికొందరు మాత్రం..కిరణ్‌ కన్నా దారుణంగా పోస్టులు పెట్టే వైసీపీ సోషల్‌ మీడియా యాక్టివిస్టులు చాలా మందే ఉన్నారని, వారందరనీ కూడా అరెస్టు చేయాలని సూచిస్తున్నారంట. అయితే సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడితే మాత్రం రాబోయే రోజుల్లో మరిన్ని అరెస్టులు తప్పవనే సంకేతాలను కిరణ్ అరెస్ట్ ద్వారా ఇచ్చిందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.