Pawan Kalya : కార్యకర్తకు పెద్ద పదవి.. పవన్ కల్యాణ్ స్ట్రాటజీ అదేనా..?
Pawan Kalyan : పార్టీ కోసం పనిచేస్తే..ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకున్నా.. పదవులు దక్కుతాయని సందేశాన్ని పంపగలిగారు పవన్.

Pawan Kalyan
Pawan kalyan: ఆయనంటే ఓ ఆశ. సేనాని అంటే భవిష్యత్‌కు భరోసా. కేవలం పవన్ కోసమే పనిచేసే జనసైనికులు కొన్ని లక్షల మంది. అలాంటి అభిమానులు.. జనసేన కార్యకర్తలంటే పవన్‌కు అమితమైన అభిమానం. కార్యకర్తకే పెద్దపీట అని ఆయన అంటున్నా.. కూటమిలో ఉండటంతో కీలక పోస్టులు దక్కకపోవచ్చు. కానీ, కష్టకాలంలో పార్టీకోసం పనిచేసిన కార్యకర్తలందరికీ తన మనసులో చోటు ఉందంటున్నారు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. మాటల్లో చెప్పడమే కాదు.. కిందిస్థాయి సామాన్య జనసైనికుడిని అందలం ఎక్కించారు.
Also Read: OG Premieres: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అలర్ట్.. ఓజీ ప్రీమియర్ షో టైమింగ్స్ లో మార్పులు
నమ్మిన సిద్ధాంతం కోసం.. అనుకున్న లక్ష్యం కోసం..అతనిది అవిశ్రాంత పోరాటం. ఫస్ట్ టైమ్ ఎన్నికల్లో పోటీ చేసి రెండు చోట్ల ఓడినా కుంగిపోలేదు. పదేళ్ల నిరీక్షణ, నిరంతర శ్రమతో పోరాడి నిలిచి గెలిచారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఏపీలో పోటీ చేసిన 21 సీట్లలో 21 గెలిచి సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. అయితే ఈ ప్రయాణంలో పవన్ ఎప్పుడూ క్యాడర్ బలోపేతం మీద పెద్దగా కాన్సంట్రేట్ చేయలేదు. కానీ తన ప్రయాణంలో తన వెంట నడుస్తూ.. అప్పటి వైసీపీ ప్రభుత్వ విధానాలపై పోరాడిన ప్రతీ కార్యకర్తను, నేతను గుర్తు పెట్టుకుంటున్నారు. తన దృష్టిలో ఉన్న ప్రతీ నాయకుడికి పార్టీ పదవో లేకపోతే ఏదైనా నామినేటెడ్ పోస్ట్ కట్టబెట్టి క్యాడర్‌కు ఓ ఇండికేషన్ పంపిస్తున్నారు జనసేనాని.
ఏపీలో ప్రధాన ఆలయాల్లో ఒకటి శ్రీకాళహస్తి టెంపుల్. ఆ ఆలయ ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ పోస్ట్‌కు ఉండే డిమాండే వేరు. వాస్తవానికి శ్రీకాళహస్తి ఛైర్మన్ పదవి కోసం టీడీపీతో పాటు జనసేన నుంచి చాలామంది పోటీపడ్డారు. టీడీపీ సీనియర్ లీడర్‌కే శ్రీకాళహస్తి టెంపుల్ ఛైర్మన్ పదవి ఇస్తారని కూడా ప్రచారం జరిగింది. కానీ కూటమిలో భాగంగా ఉన్న పవన్ కల్యాణ్ శ్రీకాళహస్తి ఆలయ కమిటీ ఛైర్మన్ పదవిని జనసేన కోటాలోకి తీసుకున్నారు. అంతేకాదు అత్యంత సాధారణ కార్యకర్తకు శ్రీకాళహస్తి టెంపుల్ ఛైర్మన్ పోస్టును కట్టబెట్టారు. తిరుపతి జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కొట్టే సాయిప్రసాద్‌కు ఈ పదవిని కట్టబెట్టడం ద్వారా పనిచేసిన వారికి తగిన గుర్తింపు, గౌరవం దక్కుతుందన్న ఇండికేషన్ పంపినట్లు అయింది.
శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన కొట్టే సాయిప్రసాద్ రాజకీయాలపై ఆసక్తి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై అభిమానంతో జనసేన తరపున చురుకైన కార్యకర్తగా మారారు. ఫ్యాన్సీ షాపు వ్యాపారిగా ఉంటూ రాజకీయంగా చురుగ్గా వ్యవహరించిన సాయిప్రసాద్ గత ప్రభుత్వంలో చేసిన ఓ చిన్న పోరాటం ఆయనకు రాష్ట్రవ్యాప్త గుర్తింపు తెచ్చింది. ఇప్పుడు ఓ పెద్ద ఆలయానికి ఛైర్మన్‌గా చేసిందని అంటున్నారు.
వైసీపీ అధికారంలో ఉండగా, శ్రీకాళహస్తిలో ఓ బాలిక మిస్సింగ్ కేసుకు సంబంధించి ఆందోళన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అప్పటి శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్ ఆందోళన చేస్తున్న జనసైనికుడు కొట్టే సాయిప్రసాద్‌ను చెంపపై కొట్టారు. అంతేకాకుండా ఆయనపై దురుసుగా వ్యవహరించారు. ఈ సంఘటనపై వీడియో వైరల్ అయింది. అంతేకాకుండా పోలీసు అధికారిగా ప్రజలకు రక్షణ కల్పించాల్సిందిపోయి, తమ పార్టీ కార్యకర్తలపై చేయిచేసుకోడాన్ని సీరియస్‌గా తీసుకున్న జనసేనాని పవన్ కల్యాణ్ శ్రీకాళహస్తికి వెళ్లి సాయిప్రసాద్‌కు సంఘీభావం తెలిపారు. అంతేకాకుండా అతడిని తీసుకుని వెళ్లి తిరుపతి ఎస్పీకి అప్పట్లోనే ఫిర్యాదు చేశారు. బాలిక మిస్సింగ్ కేసుపై జనసేన కార్యకర్తలు ఆందోళన చేయడం, ఈ సందర్భంగా చోటుచేసుకున్న వివాదం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేనాని పవన్ గతంలో పార్టీ కోసం పనిచేసిన వారిని గుర్తించుకుని పదవుల పందేరంలో ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలో చిత్తూరు జిల్లాలో టీటీడీ తర్వాత పెద్దదైన శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ పదవిని ఏరికోరి సాయిప్రసాద్‌కి కట్టబెట్టారు. ఈ పదవి కోసం కూటమిలోని టీడీపీ, బీజేపీ నుంచి కూడా తీవ్ర పోటీ ఎదురైంది. ముఖ్యంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా ఆలయ చైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. కానీ, జనసేనాని పవన్ నిర్ణయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు జనసేన కార్యకర్త కొట్టే సాయిప్రసాద్‌ను ఆలయ కమిటీ చైర్మన్‌గా ఎంపిక చేశారు.
ఈ నియామకం జనసేన క్యాడర్‌లో ఆశలు రేకెత్తిస్తుంది. పార్టీ కోసం పనిచేస్తే..ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకున్నా.. పదవులు దక్కుతాయని సందేశాన్ని పంపగలిగారు పవన్. కొట్టే సాయికుమార్‌కు పెద్ద పదవి ఇవ్వడంపై జనసైనికులు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పవన్ అంటే ఓ నమ్మకం. ఆయనంటే ఓ ఆశ. అతని వెంటే తమ ప్రయాణం అని పోస్టులతో హోరెత్తిస్తున్నారు. అప్పుడు సీఐ కొట్టే సాయికుమార్‌పై చేయి చేసుకోవడం ఎంత హైలెట్ అయిందో.. ఇప్పుడు ఆయనకు దక్కిన పదవితో అంతకు మించిన హైప్ క్రియేట్ అవుతుంది. ఏదైనా పవన్ తీసుకున్న నిర్ణయం జనసేన క్యాడర్‌నే కాదు సాధారణ పబ్లిక్‌ను కూడా అట్రాక్ట్ చేస్తోంది.