మత్తులో మహానగరాలు : గంజాయికి అడ్డాగా మారిన విశాఖ, హైదరాబాద్

మత్తులో మహానగరాలు : గంజాయికి అడ్డాగా మారిన విశాఖ, హైదరాబాద్

Updated On : December 20, 2020 / 10:56 AM IST

Cannabis smuggling : తెలుగు రాష్ట్రాల్లోని విశాఖ, హైదరాబాద్ లు గంజాయికి అడ్డాగా మారాయి. విశాఖ మహానగరం గంజాయి స్మగ్లర్లకు అడ్డగా మారుతోంది. ఏజెన్సీలో వందలాది ఎకరాల్లో సాగు చేసిన గంజాయిని…గుట్టుచప్పుడు కాకుండా సరిహద్దులు దాటించేస్తున్నారు మత్తుమాయగాళ్లు. చెక్‌ పోస్టులు పెట్టినా.. నిఘా పెంచినా… అక్రమ రవాణాకు ఫుల్‌స్టాప్‌ మాత్రం పడటం లేదు. పోలీసుల కళ్లు కప్పి సిటీలోకి ఎంటరవుతున్న స్మగ్లర్లు…ఆపై గుట్టుచప్పుడు కాకుండా హైదరాబాద్‌కు, దేశ, విదేశాలకు తరలించేస్తున్నారు.

మొన్నటి వరకు పర్యాటకం అనగానే గుర్తుకొచ్చేది ఏజెన్సీ ప్రాంతాలైన అరకు, పాడేరు, చింతపల్లి ప్రాంతాలు. అయితే ఈ మధ్య కాలంలో పర్యాటక ప్రాంతం కాస్త గంజాయ్ సాగుకు, గంజాయ్ రవాణాకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోతుంది. పర్యాటకంగా ఎంత అభివృద్ది చెందుతుందో…గంజాయ్ సరఫరా అంతకన్నా వేగంగా విస్తరిస్తోంది. టూరిస్టుల పేరుతో అక్కడికి వెళ్తున్న స్మగ్లర్లు… బ్యాగుల్లో గంజాయ్ ప్యాకెట్లను నింపుకుని దర్జాగా సిటీలోకి తీసుకువచ్చి… అక్కడ్నుంచి రాష్ట్ర సరిహద్దులు దాటించేస్తున్నారు. పోలీసుల తనిఖీల్లో పట్టుబడేది కేవలం 10 నుంచి 20 శాతమే.. మిగతా 90 శాతాన్ని వివిధ మార్గాలు, వివిధ రూపాల్లో రవాణా చేసేస్తున్నారు.

లాక్‌డౌన్ తర్వాత గంజాయి అక్రమ రవాణా మరింత పెరిగింది. లాక్‌డౌన్ పీరియడ్‌లో వందల ఎకరాల్లో సాగు చేసిన గంజాయిని…ట్రాన్స్‌పోర్ట్ అందుబాటులోకి రావడంతో….జోరుగా సరిహద్దులు దాటించేందుకు రంగం సిద్దం చేసుకున్నారు స్మగ్లర్లు. అయితే ఏజెన్సీల నుంచి పోలీసుల కళ్లు కప్పి రవాణా చేసేందుకు బీహార్, కలకత్తా, ఒరిస్సా, యూపీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి గంజాయి గ్యాంగ్‌లు నెల రోజుల క్రితమే దిగాయి. గుంపులుగా వెళ్తే పట్టుబడే అవకాశం ఉండటంతో…ఇద్దరు, ముగ్గురు చొప్పున వెళ్లి కేజీల కొద్ది సరుకును తరలిస్తున్నాయి ఈ గంజాయి గ్యాంగ్‌లు.

అక్రమార్కులు ఎప్పడికప్పుడు కొత్త పద్ధతులు ఎంచుకుని పోలీసులు కళ్లుకప్పి రవాణా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి రెండు కేసులను ఛేదించిన విశాఖ పోలీసులు..నిందితులను అరెస్టు చేశారు. అగనంపూడిలో గ్యాస్‌ సిలిండర్‌ అడుగు భాగం కట్‌ చేసిన గంజాయి ప్యాకెట్లు పెట్టి తరలిస్తున్న స్మగ్లర్లను పట్టుకున్నారు. గ్యాస్‌ సిలిండర్‌లో పది కేజీల గంజాయి పెట్టిన స్మగ్లర్లు…ఆటో సీటు కోసేసి మిగిలిన గంజాయి పేర్చారు. అరకు నుంచి హైదరాబాద్‌ తరలిస్తుండా అగనంపూడి దగ్గర పోలీసులు పట్టుకున్నారు. మరో కేసులో పెందుర్తి దగ్గర లిక్విడ్‌ గంజాయిని స్వాధీనం చేసుకుని హైదరాబాద్‌కు చెందిన వసుంధర, శిరీషను అరెస్టు చేశారు.

గంజాయి స్మగ్లర్లను పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారని తెలిపారు విశాఖ ఎస్పీ. పలుమార్లు స్మగ్లర్ల ఛేజింగ్‌లో పోలీసులు గాయపడిన సందర్భాలు కూడా ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. పోలీసులు సరిగ్గా స్పందించట్లేదని అనడం సరికాదని… తమ కష్టాన్ని నీరుగార్చొద్దని అన్నారు. గంజాయి అక్రమ రహణాను అరికట్టేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని విశాఖ ఎస్పీ అన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో గానీ..,దేశంలో గానీ ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని లింక్‌లు విశాఖతోనే ముడిపడి ఉంటున్నాయి. విశాఖ టు హైదరాబాద్‌ వయా బెంగళూరుకు ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాయి గంజాయి ముఠాలు. ఇటీవలే ఏపీ పోలీస్ స్టిక్కర్ ఉన్న కారుతో గంజాయి స్మగ్లింగ్ చేస్తూ..అనంతపురం జిల్లా ఏఆర్ కానిస్టేబుల్ మోహన్‌ కృష్ణతో పాటు..మరో ఇద్దరు పోలీసులకు చిక్కారు. అయితే సీఐ శ్రీరామ్‌, కానిస్టేబుల్‌ మోహన్‌కృష్ణపై గతంలోనూ గంజాయి స్మగ్లింగ్ చేసిన ఆరోపణలున్నట్లు తెలుస్తోంది.

ఇక ఉప్పల్‌ నల్లచెరువు దగ్గర పట్టుబడ్డ గంజాయిని హైదరాబాద్‌లోని ఇంజినీరింగ్‌ స్టూడెంట్స్‌కు సప్లై చేస్తున్నట్లు గుర్తించారు ఎక్సైజ్‌ అధికారులు. 16 లక్షల రూపాయల విలువైన 200 కిలోల గంజాయిని సీజ్‌ చేసిన పోలీసులు..గంజాయితో పట్టుబడ్డ కారు సీఐ శ్రీరామ్‌ పేరుతో ఉన్నట్లు తేల్చారు. నర్సంపేట ఏజెన్సీ నుంచి హైదరాబాద్‌కు గంజాయిని తీసుకొచ్చి.. నగరంలోని పలు కాలేజీల విద్యార్థులకు గంజాయిని సరఫరా చేస్తున్నట్లు ఆబ్కారీ పోలీసులు గుర్తించారు.