వైసీపీ నేతలకు బిగ్‌షాక్.. ప్రసన్నకుమార్ రెడ్డిసహా పలువురిపై కేసు నమోదు

మాజీ మంత్రి, వైసీపీ నేత ప్రసన్నకుమార్ రెడ్డితోపాటు పలువురు వైసీపీ నేతలపై దుర్గామిట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.

వైసీపీ నేతలకు బిగ్‌షాక్.. ప్రసన్నకుమార్ రెడ్డిసహా పలువురిపై కేసు నమోదు

Prasanna Kumar Reddy

Updated On : August 1, 2025 / 11:21 AM IST

Andhrapradesh: మాజీ మంత్రి, వైసీపీ నేత ప్రసన్నకుమార్ రెడ్డితోపాటు పలువురు వైసీపీ నేతలపై దుర్గామిట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గురువారం నెల్లూరు జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా నిబంధనలను అతిక్రమించి బైఠాయించడంతోపాటు బారికేడ్లు తోసేయడం, హెడ్ కానిస్టేబుల్‌కు గాయాలైన ఘటనలో ప్రసన్న కుమార్ రెడ్డితోపాటు వైసీపీ నేతలు బొబ్బల శ్రీనివాస్ యాదవ్, పాతపాటి ప్రభాకర్ లపై పోలీసులు కేసు నమోదు చేశారు.

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి గురువారం నెల్లూరు జిల్లాలో పర్యటించారు. తొలుత జిల్లా జైలుకు వెళ్లిన జగన్.. అక్కడ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని ములాఖత్ లో కలిసి మాట్లాడారు. ఆ తరువాత ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లిన జగన్ ఆయన్ను పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులతో కాసేపు మాట్లాడారు. అయితే, జగన్ పర్యటన సందర్భంగా వైసీపీ కార్యకర్తలు భారీగా తరలిరావడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

కొందరు వైసీపీ కార్యకర్తలు బారికేడ్లను తోసుకుంటూ ముందుకెళ్లారు. కార్యకర్తలను నిలువరించే ప్రయత్నంలో పోలీసులు, వైసీపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఓ హెడ్ కానిస్టేబుల్ పై వైసీపీ కార్యకర్తలు పడటంతో ఆయనకు చెయ్యి విరిగింది. మరోవైపు పోలీసుల తీరును నిరసిస్తూ ప్రసన్న కుమార్ రెడ్డి రోడ్డుపై బైఠాయించారు. ఫలితంగా ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో జగన్ పర్యటన సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతోపాటు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనేలా వ్యవహరించారంటూ పోలీసులు ప్రసన్న కుమార్ రెడ్డితోపాటు పలువురు వైసీపీ నేతలపై కేసులు నమోదు చేశారు.