6 లైన్ల ఎలివేటెడ్‌ కారిడార్‌, అమరావతికి కొత్త రైల్వే లైన్.. ఏపీకి కేంద్రం డబుల్ ధమాకా..!

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, అమరావతి నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉందన్న అంశానికి నిదర్శనంగా ఇవాళ కేంద్ర క్యాబినెట్ లో కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది.

6 లైన్ల ఎలివేటెడ్‌ కారిడార్‌, అమరావతికి కొత్త రైల్వే లైన్.. ఏపీకి కేంద్రం డబుల్ ధమాకా..!

Updated On : October 24, 2024 / 7:08 PM IST

Andhra Pradesh : ఏపీకి దీపావళి సందర్భంగా డబుల్ ధమాకా ప్రకటించింది కేంద్రం. అటు అమరావతికి కొత్త రైల్వే లైన్ తో పాటు ఇటు ఏపీ రహదారుల అభివృద్ధి కోసం రూ.252 కోట్ల 42 లక్షలను కేంద్రం మంజూరు చేసింది. ఇక 2వేల 245 కోట్ల రూపాయలతో 57 కిలోమీటర్ల మేర అమరావతికి కొత్త రైల్వే లైన్ ఏర్పాటు చేయనుంది. అమరావతి నుంచి హైదరాబాద్, చెన్నై, కోల్ కతాకు నేరుగా అనుసంధానం చేస్తూ నిర్మించనున్నారు. ఈ లైన్ నిర్మాణం ద్వారా 19 లక్షల పనిదినాల కల్పన జరగనుంది.

మరోవైపు ఏపీలో రహదారుల అభివృద్ధికి కేంద్రం నిధులు మంజూరు చేసింది. 252 కోట్ల 42 లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ట్వీట్ చేశారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం దగ్గర 6 లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనున్నారు. దీని కోసం నిధులు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, అమరావతి నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉందన్న అంశానికి నిదర్శనంగా ఇవాళ కేంద్ర క్యాబినెట్ లో కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అమరావతి రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లినప్పుడు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వద్ద రైల్వే లైన్ ప్రతిపాదన ఉంచారు. రికార్డ్ సమయంలో కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం జరిగింది. మొత్తం 57 కిలోమీటర్ల పొడవు గల రైల్వే లైన్ ను రూ.2వేల 245 కోట్లతో నిర్మాణం జరగబోతోంది. ఇటు ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు ఈ కొత్త రైల్వే లైన్ ఉండబోతోంది.

మధ్యలో కృష్ణా నదిపై 3.2 కిలోమీటర్ల మేర రైల్వే వంతెన నిర్మాణం కాబోతోంది. ఇటు దక్షిణాది రాష్ట్రాలకు, అటు ఉత్తరాది రాష్ట్రాలకు అమరావతితో కనెక్టివిటీ ఉండబోతోంది. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అమరావతి నిర్మితం అవుతున్న తరుణంలో.. రైల్వే లైన్ బూస్టింగ్ కానుంది. ప్రతి రాష్ట్ర రాజధానికి కూడా రైల్వే లైన్ కనెక్టివిటీ ఉంది. కానీ, నూతన రాజధానిగా అమరావతి నిర్మితమవుతున్న సమయంలో.. రైల్వే లైన్ కనెక్టివిటీ అనేది లేదు. విజయవాడకు వెళ్లి రాజధానికి ప్రయాణికులు వెళ్లాల్సి ఉంటుంది. ఈ తరుణంలో నూతన రాజధానికి కొత్త రైల్వే లైన్ ఎంతగానో దోహదపడుతుంది.

కచ్చితంగా ఇటు రాజధాని అభివృద్ధికి కూడా ఇది ఊతమిచ్చే అంశంగా ఉంటుందని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అలాగే ఏపీలో రహదారుల నిర్మాణానికి, అభివృద్ధికి కూడా ఇవాళ నిధులను విడుదల చేసింది జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ. 252.42 కోట్ల రూపాయలను విడుదల చేసింది. శ్రీకాకుళం జిల్లా రణస్థలం వద్ద 6 లేన్ ఎలివేటెడ్ కారిడార్ ఫ్లైఓవర్ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నట్లుగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఇటు రైల్ కనెక్టివిటీ, అటు రోడ్ కనెక్టివిటీ దిశగా అడుగులు పడ్డాయి. సుమారు 6వేల కోట్లకు పైగా మౌలిక వసతుల కల్పన, రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి నిర్ణయం తీసుకోవడం జరిగింది.

అందులో ప్రధానంగా ఎన్డీయే భాగస్వామ పక్షాలుగా ఉన్న రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, బీహార్ కు పెద్దపీట వేసింది కేంద్రం. బీహార్ రాష్ట్రానికి సంబంధించి కూడా సుమారు 4వేల కోట్లకు పైగా నిధులతో రైల్వే లైన్లకు సంబంధించి ఇవాళ కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. మొదటి నుంచి ఏపీ, బీహార్ కు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది కేంద్రం. ఈ రెండు రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు పలు సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

 

Also Read : ఒక్కొక్కరుగా వైసీపీని వీడుతున్న నేతలు.. లీడర్లకు ఫ్యాన్‌ కింద ఉక్కపోత ఎక్కువైందా?