తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై కేంద్రం సీరియస్.. సీఎం చంద్రబాబుకి కీలక ఆదేశం
ఈ అంశంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోబోతున్నట్లుగా వివరించారు.

Tirupati Laddu Controversy : వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందన్న వార్తలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వార్త శ్రీవారి భక్తుల్లో ఆందోళన నింపింది. ఈ నేపథ్యంలో లడ్డూ కల్తీ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. మొత్తం వ్యవహారంపై సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కోరింది. లడ్డూ కల్తీ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు.
Also Read : తిరుమల లడ్డూ వివాదంపై ప్రెస్‌మీట్‌లో వైఎస్ జగన్ సంచలన కామెంట్స్
వారి వద్ద ఉన్న సమాచారాన్ని పంపాల్సిందిగా కోరినట్లు వివరించారు. ఇక, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని హామీ ఇచ్చినట్లు చెప్పారు. ఇక, ఈ అంశంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోబోతున్నట్లుగా వివరించారు.
తిరుమల లడ్డూ కల్తీ వివాదం వ్యవహారంతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సైతం ఈ అంశంపై స్పందించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జేపీ నడ్డా ప్రసాదం కల్తీ అంశంపై ఏపీ సీఎం చంద్రబాబుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నాను అని చెప్పారు. ప్రసాద కల్తీ వివరాలతో కూడిన నివేదికను అందజేయాలని చంద్రబాబును కోరానని నడ్డా చెప్పారు. అలాగే రాష్ట్ర అధికారులతో కూడా మాట్లాడతానని, ఆహార భద్రతా ప్రమాణాల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని జేపీ నడ్డా స్పష్టం చేశారు. పార్టీలకు అతీతంగా ప్రసాదం కల్తీ అంశంపై తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్రతి ఏటా తిరుమల శ్రీవారిని కోట్లాది మంది భక్తులు దర్శించుకుంటారు. తిరుమల శ్రీవారి ప్రసాదానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. అటువంటి ప్రసాదంలో జంతువుల కొవ్వుని కలిపి ప్రసాదాన్ని తయారు చేశారు అన్న నివేదిక రావడం పట్ల ప్రతి ఒక్కరూ తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవాలి అనే డిమాండ్లు వస్తున్నాయి. సుప్రీంకోర్టు సుమోటోగా ఈ కేసుని విచారించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. అలాగే సుప్రీంకోర్టులో ఒక లెటర్ పిటిషన్ సైతం ఫైల్ అయ్యింది. ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం జరిగింది. ప్రభుత్వం నియమించిన అధికారుల కారణంగానే ఇలాంటివి చోటు చేసుకున్నాయని, ఆలయ పవిత్రత, మత విశ్వాసాలు, సాంప్రదాయాలపై అవగాహన ఉన్నవారికే ఆలయ నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని లెటర్ పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రసాదం కల్తీ అంశంపై తక్షణమే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలన్న డిమాండ్ ఉంది. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం కావడం, భక్తులు మహా ప్రసాదంగా స్వీకరించే లడ్డూ తయారీలో కల్తీ జరిగిందన్న ఆరోపణలను కేంద్రం సీరియస్ గా తీసుకుంది.