AP Govt : ఏపీలోని డ్వాక్రా మహిళలకు భారీ శుభవార్త.. ఇలాచేస్తే.. నేరుగా అకౌంట్లలోకి రూ.10లక్షలు..
AP Govt : స్వయం సహాయక సంఘాల మహిళలు సొంతంగా వ్యాపారాలు ప్రారంభించి ఆర్థికంగా ఎదిగేందుకు ఎలాంటి గ్యారెంటీ లేని భారీ రుణ సదుపాయం లభించనుంది.
Dwakra women
AP Govt : ఏపీలోని స్వయం సహాయక సంఘాల (డ్వాక్రా)ను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో సరికొత్త రుణ పరంపరకు శ్రీకారం చుట్టింది. ఈ కొత్త విధానం ద్వారా డ్వాక్రా సంఘాల్లోని వారు ఏకంగా రూ.10లక్షలు పొందేందుకు అవకాశం ఉంటుంది.
స్వయం సహాయక సంఘాల మహిళలు సొంతంగా వ్యాపారాలు ప్రారంభించి ఆర్థికంగా ఎదిగేందుకు ఎలాంటి గ్యారెంటీ లేని భారీ రుణ సదుపాయం లభించనుంది. డ్వాక్రా సంఘాల్లోని మహిళలు సొంతంగా ఎంఎస్ఎంఈ (MSME) యూనిట్లను ఏర్పాటు చేసుకుని, రాణించేలా గరిష్ఠంగా రూ .10లక్షల వరకు వ్యక్తిగత రుణాలను అందించనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రతిష్టాత్మక దీన్ దయాల్ అంత్యోదయ యోజన – జాతీయ గ్రామీణ జవనోపాధుల కార్యక్రమం కింద ఈ భారీ ఆర్థిక సాయాన్ని సమకూర్చనున్నారు. ఈ రుణాలకు ఎలాంటి పూచీకత్తు ఇవ్వాల్సిన అవసరం లేకపోవడం డ్వాక్రా మహిళలకు పెద్ద ఊరటనిచ్చే అంశం. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. ఇప్పటికే విజయవంతంగా వ్యాపారాలు నిర్వహిస్తున్న మహిళలు, కొత్తగా వ్యాపారాలు పెట్టాలనుకునే మహిళలు ఈ రుణాలు పొందేందుకు అర్హులని తెలిపారు.
వ్యవసాయ, దాని అనుబంధ రంగాలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు, మునగ సాగు లేదంటే ప్రాసెసింగ్, తేనెటీగల పెంపకం, పుట్టగొడుగుల ఉత్పత్తి, నారు పెంచే నర్సరీలు, సోలార్ డ్రయ్యర్లు, రక్షిత సాగు విధానాలు, చేపల ప్రాసెసింగ్ వంటి ఉపాధి మార్గాల ఏర్పాటుకు ఈ పథకం కింద ప్రత్యేకంగా ఆర్థిక భరోసా కల్పించనున్నారు. ఈ రుణాల కోసం అవసరమయ్యే ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) తయారీలోనూ, ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ దరఖాస్తుల పూర్తి ప్రక్రియలోనూ సెర్ప్ పరిధిలోని ‘వెలుగు’ విభాగం అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది మహిళలకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.
