అమరావతిని అడ్డుకునేందుకు కేసీఆర్ యత్నం : చంద్రబాబు

అమరావతిని అడ్డుకునేందుకు కేసీఆర్ యత్నిస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఏపీకి ఇవ్వాల్సిన రూ.లక్ష కోట్లను ఇవ్వడం లేదన్నారు. ‘ఏపీపై కేసీఆర్ పెత్తనమేంటి.. బెదిరిస్తే నేను భయపడతానా? కేసీఆర్… ఖబడ్దార్ నీ ఆటలు నా దగ్గర సాగవు’ అని హెచ్చరించారు. తునిలో ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ప్రసంగించారు.
తనను తిట్టడానికి హైదరాబాద్ నుంచి వలస పక్షులు వచ్చాయన్నారు. కేసీఆర్ కు ఊడిగం చేస్తారా అని మండిపడ్డారు. తనకు ఆత్మగౌరవం ఉందన్నారు. మనల్ని ఎన్నో తిట్లు తిట్టిన కేసీఆర్ తో జగన్ కుమ్మక్కయ్యారని తెలిపారు. జగన్ పై 36 కేసులుంటే తనపై ఒక్క కేసు మాత్రమే ఉందన్నారు. తనపై కేసు పెట్టి మహారాష్ట్ర ప్రభుత్వం దొంగ దెబ్బ తీసిందన్నారు.
జగన్ ఓట్ల దొంగ అన్నారు. జగన్.. అసెంబ్లీకి 24 రోజులు వస్తే, జైలుకు 240 రోజులు వెళ్లారని ఎద్దేవా చేశారు. ఏదైనా పోరాటం చేయాలంటే.. సమ్మఉజ్జీలతో పోరాటం చేయాలన్నారు. కోడి కత్తి పార్టీ (వైఎస్సార్ కాంగ్రెస్ )తో పోటీ నామూషీగా ఉందన్నారు. జగన్ కు లోటస్ పాండ్ లో ఏం పని అని ప్రశ్నించారు. వైసీపీ నేతలు చెల్లని కాసులు అని ఎద్దేవా చేశారు.
రైతులకు అండగా ఉంటానని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఆడబిడ్డల పెళ్లిళ్లకు లక్ష రూపాయల ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు. పేదలకు ఉచితంగా ఇళ్లు ఇస్తామని చెప్పారు. రాష్ట్రానికి తానే నెంబర్ వన్ డ్ర్రైవర్ అని అన్నారు. డ్వాక్రా సంఘాలు తన మానస పుత్రిక అని అభివర్ణించారు. గుజరాత్ కు వెళ్లాల్సిన కియా మోటర్ ఫ్యాక్టరీని ఏపీకి తీసుకొచ్చానని తెలిపారు.