ఏపీ బడ్జెట్.. ఏయే అంశాలకు, పనులకు అధిక ప్రాధాన్యత ఇచ్చారంటే..
రెండు మూడు నెలలకో పథకాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వం.. చివరి నాలుగు నెలల్లోనూ ఆ దిశగానే అడుగులు వేయబోతోంది.

AP Budget : ఏపీలో కూటమి ప్రభుత్వం తొలి పద్దును ప్రవేశ పెట్టనుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. అభివృద్ధి, సంక్షేమం సమతూకంగా బడ్జెట్ ను రూపొందించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాజధాని పనులు, సాగునీటి ప్రాజెక్టులకు పెద్ద పీట వేసే అవకాశం ఉంది. రోడ్ల మరమ్మతులు ఇతర అభివృద్ధి పనులకు కూడా ప్రాధాన్యత ఇవ్వనుంది సర్కార్.
2024-25 ఆర్థిక సంవత్సరానికి ఏపీ పూర్తి స్థాయి బడ్జెట్ ను సోమవారం ఉభయసభల్లో ప్రవేశ పెట్టనుంది ప్రభుత్వం. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈ బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెడతారు. ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఆర్థిక మంత్రితో పాటు ఉన్నతాధికారులకు బడ్జెట్ పై దిశానిర్దేశం చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై అధ్యయనానికే నాలుగు నెలల సమయం పట్టింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై శ్వేతపత్రం విడుదల చేసింది. అప్పటికి కూడా రాష్ట్రంలో పూర్తి స్థాయి అప్పుల లెక్కలు, పెండింగ్ బిల్లుల లెక్కలు తేలలేదు. ఈ పరిస్థితుల్లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు ఇంత సమయం పట్టింది.
సాధారణంగా ఏటా మార్చిలోపు బడ్జెట్ ను చట్టసభల్లో ప్రవేశపెట్టి ఆమోదం పొందుతారు. ఎన్నికల సమయంలో కావడంతో గత వైసీపీ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను సమర్పించింది. జూన్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. జూలైలో ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ సమర్పించాల్సి ఉన్నా.. ఆర్థిక పరిస్థితులపై అవగాహన, పూర్తి సమాచారం కోసం వాయిదా వేసింది. మరో 4 నెలల కాలానికి తాత్కాలికంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ని గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్ జారీ చేయించారు. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి పనులు, ఇతర నిర్వహణ ఖర్చులు కలిపి లక్ష 29 వేల 772.97 కోట్ల రూపాయలకు అనుమతులు తీసుకున్నారు.
ప్రస్తుతం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతున్నా.. 4 నెలలే మిగిలి ఉంది. ఈ వ్యవధిలో ఎంత ఖర్చు చేయాలి అనే అంచనాల మేరకు పూర్తి స్థాయి బడ్జెట్ ను రూపొందించింది ప్రభుత్వం. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు సంక్షేమ పథకాల అమలు ప్రారంభించింది కూటమి సర్కార్. సూపర్ సిక్స్ పథకాలకు కేటాయింపులు ఈ ఆర్థిక సంవత్సరంలో ఎలా ఉండాలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు పూర్తి స్థాయిలో దిశానిర్దేశం చేశారు. ప్రజలు అభివృద్ధి, సంక్షేమాన్ని కలిపి కోరుకుంటున్నారని.. అందుకు అనుగుణంగానే బడ్జెట్ ఉండాలన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. రెండు మూడు నెలలకో పథకాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వం.. చివరి నాలుగు నెలల్లోనూ ఆ దిశగానే అడుగులు వేయబోతోంది.
Also Read : ఏపీలో నామినేటెడ్ పదవులు ఆశిస్తున్నదెవరు? ఎమ్మెల్సీ కోసమే పట్టుబడుతున్న లీడర్లు ఎవరు?