Vijayawada : చంద్రబాబు అరెస్ట్ కేసు.. విజయవాడలో హైటెన్షన్, నగరం మొత్తం పోలీసుల భారీ భద్రత, అల్లర్లు జరక్కుండా చర్యలు
చంద్రబాబుకి వ్యతిరేకంగా కోర్టు తీర్పు వస్తే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. Chandrababu Arrest Case - Vijayawada

Chandrababu Arrest Case - Vijayawada
Chandrababu Arrest Case – Vijayawada : విజయవాడలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. విజయవాడ నగరం మొత్తాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బెజవాడ పోలీసుల పహారాలోకి వెళ్లిపోయింది. చంద్రబాబు అరెస్ట్ కేసులో ఏ క్షణమైనా తీర్పు వచ్చే అవకాశం ఉంది. కోర్టు తీర్పుపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. న్యాయమూర్తి ఎలాంటి తీర్పు ఇస్తారు అని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తీర్పు నేపథ్యంలో ఏసీబీ కోర్టు దగ్గర టెన్షన్ టెన్షన్ వాతావరణం ఉంది. ఏసీబీ కోర్టు దగ్గర పోలీసులు భారీగా మోహరించారు.
స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబుకి రిమాండ్ విధిస్తే అల్లర్లు జరుగుతాయన్న సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. కోర్టు పరిసరాల్లో భారీ భద్రతను కల్పించారు. చంద్రబాబుకి వ్యతిరేకంగా కోర్టు తీర్పు వస్తే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. అటు టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఏసీబీ కోర్టుకు చేరుకుంటున్నాయి. మరోవైపు కోర్టు పరిసరాల్లో భద్రతను, విజయవాడలో పరిస్థితులను సీపీ పరిశీలించారు.
ఏసీబీ కోర్టు తీర్పు నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. కోర్టు ఆవరణలో 3 కిలోమీటర్ల వరకు ఆంక్షలు విధించారు. విజయవాడలోని చాలా ప్రాంతాల్లో పారా మిలటరీ రంగంలోకి దిగింది. నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణా కోర్టు వద్దకు చేరుకుని పరిస్థితులను పర్యవేక్షించారు. ఇక విజయవాడ-రాజమండ్రి రూట్ కు బలగాలను తరలించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు కేసు తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎలాంటి జడ్జిమెంట్ ఇస్తారు? అనేది హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు చంద్రబాబు నాయుడు ఏసీబీ కోర్టు హాలులోనే ఉన్నారు. తీర్పు కోసం ఆయన ఎదురుచూస్తున్నారు. కోర్టు హాల్ లోనే చంద్రబాబు తన న్యాయవాది సిద్ధార్ధ్ లూథ్రాతో మాట్లాడారు. మరోవైపు నారా లోకేశ్ సహా 200 మంది టీడీపీ లాయర్లు కోర్టు ప్రాంగణంలో తీర్పు కోసం ఉత్కంఠ ఎదురుచూస్తున్నారు. కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వస్తే సంబరాలు చేసుకునేందుకు టీడీపీ శ్రేణులు సిద్ధమయ్యాయి.
స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబు రిమాండ్ రిపోర్టుపై విజయవాడ ఏసీబీ కోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. తీర్పును న్యాయమూర్తి రిజర్వ్ చేశారు. ఏపీ సీఐడీ తరపున ఏఏజీ సుధాకర్ రెడ్డి, చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ్ లూథ్రా పోటాపోటీగా వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వం చంద్రబాబును టార్గెట్ చేసిందని సిద్ధార్ధ లూథ్రా వాదించారు. ఈ స్కామ్ పూర్తిగా రాజకీయ ప్రేరేపితం అన్నారు. 2021లో నమోదైన ఈ కేసులో హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయని, తీర్పు కూడా రిజర్వ్ అయిందని గుర్తు చేశారు. ఈ కేసు ఎప్పుడో మగిసిందని, నిందితులందరికీ బెయిల్ కూడా వచ్చిందని గుర్తు చేశారు. ఎన్నికలు వస్తున్నాయని, చంద్రబాబును ఇరికించాలనే తిరిగి కేసు రీఓపెన్ చేశారు అని కోర్టులో వాదనలు వినిపించారు సిద్ధార్ధ లూద్రా.