Chandrababu Naidu Arrest: ఏసీబీ కోర్టులో స్వయంగా తన వాదనలు వినిపించిన చంద్రబాబు నాయుడు
చంద్రబాబు తరపున న్యాయవాది సిద్దార్థ లూద్రా తన వాదనలు వినిపించారు. 409 సెక్షన్ కింద వాదనలు జరిగాయి. అసలు ఈ సెక్షన్ ఈ కేసులో పెట్టడం సబబు కాదని లూద్రా వాదనలు వినిపించారు.

Chandrababu Naidu Arrest
Chandrababu Arrest: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును సీఐడీ అధికారులు ఆదివారం ఉదయం ఏసీబీ కోర్టులో హాజరుపర్చారు. స్కిల్ డవలప్‌మెంట్ స్కాంకు సంబంధించి 28 పేజీలతో కూడిన రిమాండ్ రిపోర్టును కోర్టుకు సీఐడీ అందజేసింది. చంద్రబాబు రిమాండ్ రిపోర్ట్ పై ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. చంద్రబాబు తరపున న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, సీఐడీ తరపున అదనపు ఏజీ సుధాకర్ రెడ్డి బృందం తమ వాదనలు వినిపించారు. విచారణ ప్రక్రియ ప్రారంభం అయ్యాక 30మంది న్యాయవాదులు, కుటుంబ సభ్యులు మాత్రమే ఉండాలని, అంతకు మించిఉంటే విచారణ ప్రక్రియ మొదలు కాదని న్యాయమూర్తి సూచించారు. దీంతో కేవలం 30 మంది మాత్రమే ఉండి మిగిలిన వారు కోర్టు బయటకు వచ్చారు.
చంద్రబాబు తరపున వాదనలు వినిపిస్తామని కోరిన ముగ్గురు న్యాయవాదులు . ఇద్దరికి మాత్రమే అవకాశం ఇచ్చిన జస్టిస్ హిమ బిందు. న్యాయవాదులు సిద్ధార్థ లోద్రా, పోసాని వెంకటేశ్వర రావు పేర్లు చెప్పగా అనుమతి ఇచ్చిన న్యాయమూర్తి. అనంతరం ఏసీబీ కోర్టులో సీఐడీ సమర్పించిన రిమాండ్ రిపోర్ట్ తిరస్కరించాలని లూద్రా నోటీసు ఇచ్చారు. తిరస్కరణపై న్యాయమూర్తి వాదనలకు అనుమతి ఇచ్చారు.
చంద్రబాబు తరపున న్యాయవాది సిద్దార్థ లూద్రా తన వాదనలు వినిపించారు. 409 సెక్షన్ కింద వాదనలు జరిగాయి. అసలు ఈ సెక్షన్ ఈ కేసులో పెట్టడం సబబు కాదని లూద్రా వాదనలు వినిపించారు. 409 పెట్టాలి అంటే ముందుగా సరైన సాక్ష్యం చూపాలని అన్నారు. అనంతరం ఈ కేసులో తన వాదన వినాలని చంద్రబాబు నాయుడు కోర్టుకు విన్నవించారు. న్యాయమూర్తి అందుకు అనుమతి ఇచ్చారు. దీంతో కోర్టులో స్వయంగా చంద్రబాబు తన వాదనలు వినిపించారు. తన అరెస్ట్ అక్రమన్న చంద్రబాబు .. స్కిల్ స్కామ్‍తో నాకెలాంటి సంబంధం లేదని చెప్పారు. రాజకీయ కక్షతోనే నన్ను అరెస్ట్ చేశారని చంద్రబాబు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.