Chandrababu Warning : వాళ్లు భవిష్యత్తులో 10 రెట్లు ఎక్కువ ఇబ్బందిపడక తప్పదు, చంద్రబాబు వార్నింగ్

ఏపీ రాజకీయాలపైనే చంద్రబాబు పూర్తిగా దృష్టి పెట్టారు. ప్రత్యర్థులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. టీడీపీని ఇబ్బంది పెట్టేవారు భవిష్యత్తులో 10 రెట్లు ఎక్కువ ఇబ్బందిపడక తప్పదని హెచ్చరించారు.

Chandrababu Warning : వాళ్లు భవిష్యత్తులో 10 రెట్లు ఎక్కువ ఇబ్బందిపడక తప్పదు, చంద్రబాబు వార్నింగ్

Chandrababu Warning

Updated On : May 29, 2021 / 11:12 AM IST

Chandrababu Strong Warning : తెలుగుదేశం పార్టీ ఒక పండుగలా భావించే మహానాడు కార్యక్రమం ఈ ఏడాది కూడా వర్చువల్‌గానే జరిగింది. కరోనా నేపథ్యంలో వరుసగా రెండో ఏడాది కూడా టీడీపీ మహానాడు కార్యక్రమాన్ని వర్చువల్ మాధ్యమంగానే నిర్వహించింది. ఏపీ రాజకీయాలపైనే చంద్రబాబు పూర్తిగా దృష్టి పెట్టారు. ప్రత్యర్థులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. టీడీపీని ఇబ్బంది పెట్టేవారు భవిష్యత్తులో 10 రెట్లు ఎక్కువ ఇబ్బందిపడక తప్పదని చంద్రబాబు హెచ్చరించారు. తప్పుచేసిన వాళ్లకు చుక్కలు చూపిస్తామన్నారు. నాయకులు కేసులకు భయపడొద్దని సూచించిన చంద్రబాబు.. ధైర్యంగా పోరాడే వాళ్లకే భవిష్యత్తులో పదవులని తేల్చి చెప్పారు.

సీఎం జగన్‌ పాలనపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. జగన్ పాలనంతా అబద్ధాల అంకెల పైనే నడుస్తోందని.. వాటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని మహానాడు వేదికగా శ్రేణులకు బోధించారు. మహానాడులో రెండో రోజు రాష్ట్రంలో వ్యవసాయం, సాగునీరు సహా పలు తీర్మానాలపై చర్చ జరిగింది. రాష్ట్రానికి ఒక కన్ను అయిన అమరావతిని పొడిచేసిన జగన్‌.. రెండో కన్నుగా ఉన్న పోలవరానికీ అదేగతి పట్టిస్తున్నారని మండిపడ్డారు. రైతు ప్రభుత్వమని చెప్పుకుంటూ వారి కళ్లకు గంతలు కడుతున్నారని ధ్వజమెత్తారు.

సంక్షేమ పథకాల పేరుతో ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందని చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వ పథకాలను కొత్తవిగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. ప్రజలపై అదనంగా రూ.2.5లక్షల కోట్ల భారం వేశారని చెప్పారు. ధరలు, పన్నులు పెంచారని అన్నారు. అప్పులు తెచ్చి ఏం చేశారని చంద్రబాబు నిలదీశారు. రాష్ట్రంలో ఇసుక, మద్యం మాఫియా ఆగడాలు పెరిగిపోయాయని.. జగన్ ప్రభుత్వం ప్రజల ముందు దోషిగా నిలబడే రోజు త్వరలోనే వస్తుందని చంద్రబాబు అన్నారు.

2024లో వచ్చేది మేమే:
2024లో ఏపీలో అధికారంలోకి వచ్చేది టీడీపీనే అని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. యువతకు ప్రాధాన్యత ఇస్తామని, కార్యకర్తలకు అన్ని విధాలుగా బాసటగా ఉంటామని చంద్రబాబు అన్నారు. పార్టీకి దూరమైన అన్ని వర్గాలను అక్కున చేర్చుకుంటామన్నారు. అడ్డగోలుగా వ్యవహరిస్తూ, పార్టీకి నష్టం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని చంద్రబాబు హెచ్చరించారు. ఏడాది పాటు పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు చంద్రబాబు తెలిపారు.