యధేచ్చగా చిన్న పిల్లల అక్రమ రవాణా.. విశాఖలో సృష్టి ఆస్పత్రి భాగోతం

  • Published By: bheemraj ,Published On : July 29, 2020 / 06:16 PM IST
యధేచ్చగా చిన్న పిల్లల అక్రమ రవాణా.. విశాఖలో సృష్టి ఆస్పత్రి భాగోతం

Updated On : July 29, 2020 / 6:28 PM IST

అమాయకులైన తల్లిదండ్రులు, వెంటాడుతున్న పేదరికం.. వెరసి ముక్కుపచ్చలారని పసి పిల్లల విక్రయాలకు విశాఖ అడ్డగా మారింది. ఇతరుల బలహీనతలే లక్ష్యంగా చేసుకుని పిల్లల అక్రమ రవాణా ముఠాలు పెట్రేగి పోతున్నాయి. ఆర్థికంగా ఆదుకుంటామని నమ్మించడం, నగదు ఆశ కల్పించడం.. చివరికి వారి చిన్నారులను అమ్మేయడమే ఈ ముఠాల టార్గెట్‌. దేవుళ్లకు ప్రతిరూపాలుగా భావించే చిన్నారులను అమ్మి… లక్షలు వేసుకేసుకుంటున్నారు. విశాఖ కేంద్రంగా జరుగుతున్న ఈ వ్యవహారం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.

విశాఖలో చిన్న పిల్లల అక్రమ రవాణాకు పాల్పడుతోన్న ముఠాను పోలీసులు ఈమధ్యే పట్టుకున్నారు. ఓ ఆస్పత్రి ఎండీ ఆధ్వర్యంలోనే ఈ ముఠా చిన్నారుల అక్రమ రవాణాకు పాల్పడటం అందరినీ విస్మయానికి గురిచేసింది. నాలుగు రూపాయలు వెనసుకోవడానికి ఇంతటి దారుణానికి దిగజారుతారా అని అంతా ప్రశ్నిస్తున్నారు. చిన్నారుల అక్రమ రవాణా ముఠా టార్గెట్‌ ఒక్కటే. పెళ్లై.. భర్తతో విడిపోయి.. ఒంటరిగా బతుకుతూ కుటుంబ పోషణ భారమైన మహిళలు. చిన్న వయసులో పెళ్లి చేసుకుని తల్లులు అయ్యే నిరుపేద యువతులు. ఉచిత హెల్త్‌ క్యాంపులు పేరిటి వారిని గుర్తించి… ఆస్పత్రికి రప్పిస్తారు. ఆ తర్వాత వారికి డబ్బు ఆశ చూపెడుతారు. బలవంతం చేసైనా సరే తమకు పుట్టబోయే పిల్లలను ఇవ్వడానికి అంగీకరించేలా ఈ ముఠా చేస్తున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది.

ఈ ఒక్కముఠానే కాదు.. మరికొన్ని ముఠాలు కూడా విశాఖలో తిష్టవేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. విశాఖలో కనిపించకుండా పోతున్న పసి పిల్లల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. పోలీసులు ఎంత నిఘా పెట్టినా.. ఎన్ని చట్టాలు వస్తున్నార… యుధేచ్చగా చిన్నారుల అక్రమ రవాణా సాగుతూనే ఉంది. ముక్కుపచ్చలారని పరికందుల్ని సంతలో వస్తువుల్లా అమ్మేస్తున్నారు. చిన్నారుల అక్రమ రవాణా ముఠాల బారిన పడుతున్న వారిలో 95శాతం నిరుపేద, ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలే ఉన్నట్టు రికార్డులు చెబుతున్నాయి. ఇదే వ్యవహారాన్ని సృష్టి ఆస్పత్రి ఎండీ నమ్రత నడుపుతూ అడ్డంగా పోలీసులకు బుక్కయ్యింది.

అమ్మతనం ఓ మధురానుభూతి. పిల్లలు లేనివారికి సంతాన భాగ్యం కల్పిస్తామంటూ వెలిసింది సృష్టి ఆస్పత్రి. 2010లోనే టెస్ట్‌ట్యూబ్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. పసి పిల్లలను విక్రయించడం, ఇతర నేరాలపై ఎండీ నమ్రతపై 2018లోనే రెండు కేసులు నమోదయ్యాయి. దీంతో ఆస్పత్రి పేరును యూనివర్సల్‌ సృష్టి పెర్టిలిటీ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌గా మార్చారు. ఆ తర్వాత హైదరాబాద్‌, విజయవాడ, భువనేశ్వర్, కోల్‌కతాలో బ్రాంచ్‌లు ప్రారంభించారు. ఆస్పత్రి ఎండీ నమ్రత విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతోపాటు.. ఒడిశాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించేది.

ఆయా ప్రాంతాల్లోని ఆశా వర్కర్ల ద్వారా పేద బాలింతలు, అక్రమ సంబంధాల ద్వారా గర్భందాల్చిన యువతులు వివరాలను తెలుసుకునేవారు. అలా వారిని గుర్తించి.. ఆ తర్వాత తన ఏజెంట్లతో వ్యవహారాన్ని నడిపించేది. డబ్బును ఎరగా వేసి… వారి శిశువులను విక్రయించేందుకు ఒప్పించేది. ఇలా ఇప్పటి వరకు విశాఖలో ఈ ఎడాదిలో 56 కాన్పులు చేసింది..8 మంది పిల్లలు చేతులు మారినట్లు పోలీసులు గుర్తించారు..ఒక్కో బేబిని 8 లక్షలు నుండి 25 లక్షలు వరకు విక్రయించినట్టు పోలీసులు నిర్ధారించారు.

విశాఖ కేంద్రంగా జరుగుతున్న చిన్నారుల అక్రమ రవాణాపై మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. డాక్టర్‌ నమ్రతతోపాటు ఆమెకు సహకరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. ఆస్పత్రి గుర్తింపు రద్దు చేయాలని కోరారు. విశాఖ కేంద్రంగా నడుస్తోన్న సరోగసి కాన్పులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.

డాక్టర్‌ నమత్ర నడిపిన వ్యవహారంపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. 2018 నుంచి 5 బ్రాంచ్‌ల్లో చేసిన కాన్పుల వివరాలు, ఇతర రాష్ట్రాలతో లింకులపైనా దృష్టి పెట్టారు. నమత్రా బ్యాంక్‌ బ్యాలెన్స్‌, ఆమె ఖాతాలో మనీ డెబిట్‌, క్రెడిట్‌ వివరాలను సేకరిస్తున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ఏ ఒక్కరినీ వదిలేది లేదని పోలీసులు తేల్చి చెబుతున్నారు. రిమాండ్‌లో ఉన్న నమత్రను కస్టడీలోకి తీసుకుని మరిన్ని వివరాలు రాబడతామని అంటున్నారు. ఈ కేసులో నమ్రత నోరు విప్పితే మరిన్ని కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశముంది.