నిరూపిస్తారా : దుర్మార్గమైన కేసులు పెట్టి జైలుకు పంపించారు – చింతమనేని

దుర్మార్గమైన కేసులు పెట్టి జైలుకు పంపించారు..కానీ తనను ఏమి చేయలేకపోయారని..తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలన్నారు టీడీపీ నేత చింతమనేని. తనపై 17 ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారని, దానితో పాటు ఎన్నో కేసులు పెట్టారన్నారు. కానీ..తనకు న్యాయస్థానాలు, కోర్టులపై నమ్మకం ఉందన్నారు. 2019, నవంబర్ 16వ తేదీ శనివారం సాయంత్రం మీడియా, నియోజకవర్గ ప్రజలు, టీడీపీ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. 13 గ్రామాల్లోకి వెళుదాం..దళిత వ్యతిరేకి అంటే..శిక్షకు సిద్ధమని ప్రకటించారు. తనకు మద్దతు తెలియచేసిన వారందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు తెలిపారు.
ఎంత తపస్సు చేసినా..సరే నన్నేమి చేయలేకపోయారన్నారు. తన గురించి నియోజకవర్గ ప్రజలకు చెప్పుకోవాల్సినవసరం లేదన్నారు. కేసులు పెడుతూ ప్రభుత్వం భయబ్రాంతులకు గురి చేస్తోందన్నారు. చదువుకున్న అధికారులు పరిపాలన చేయాల్సింది పోయి బానిసలుగా, తొత్తులుగా మారిపోయారన్నారు. తన వల్ల ఎవరి తాడు తెగలేదు, ఎవరి ఇల్లు పోలేదని, అలా పోయాయని ప్రభుత్వ అధికారులు చెప్పించగలరా అని సూటిగా ప్రశ్నించారు. తనపై కేసులు తోలు బొమ్మల ఆటలా ఉన్నాయని ఎద్దేవా చేశారు. తాను ఓడానో..మిషన్లు ఓడించాయో తెలియదని ఎద్దేవా చేశారు.
పోలవరం కాల్వ మట్టి తవ్వితే అధికారులను కొట్టానని తనపై కేసు పెట్టారని చెప్పారు. ఎప్పుడూ చూడని వ్యక్తిని కిడ్నాప్ చేశానని ఎలా చెబుతారని ప్రశ్నించారు. 151 సీట్లు వచ్చాయని విర్రవీగుతున్నారని విమర్శించారు చింతమనేని.
చింతమనేని పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. పినకడిమికి చెందిన యువకులపై దౌర్జన్యం చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇసుక తవ్వకాలకు సంబంధించిన వ్యవహారంలో కులం పేరుతో దూషించి దాడికి ప్రయత్నించారని చింతమనేనిపై కొందరు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. దాదాపు 67 రోజుల తర్వాత 2019, నవంబర్ 16వ తేదీ శనివారం విడుదల అయ్యారు.
Read More : జైలు నుంచి మాజీ ఎమ్మెల్యే చింతమనేని విడుదల