పవన్ కు మరో షాక్ : మూడు రాజధానులకు చిరంజీవి మద్దతు

మెగాస్టార్ చిరంజీవి.. తన తమ్ముడు, జనసేనాని పవన్ కల్యాణ్ కు వరుస షాక్ లు ఇస్తున్నారు. ఏపీలో హాట్ టాపిక్ గా మారిన మూడు రాజధానుల అంశంపై చిరంజీవి స్పందించారు. సీఎం జగన్ ప్రతిపాదించిన త్రీ కేపిటల్ ఫార్ములాకు చిరంజీవి మద్దతు తెలిపారు. మూడు రాజధానుల ఏర్పాటు ఆలోచనను ఆయన స్వాగతించారు. అంతేకాదు మూడు రాజధానుల ఆలోచనను అందరూ స్వాగతించాలని చిరంజీవి కోరారు.
అధికార, పరిపాలన వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యం అని చిరంజీవి స్పష్టం చేశారు. సామాజిక, ఆర్థిక అసమానతలు తొలగించేలా జీఎన్ రావు కమిటీ సిఫార్సులు ఉన్నాయని చిరంజీవి అభిప్రాయపడ్డారు. గతంలో అభివృద్ధి, పాలన అంతా హైదరాబాద్ లోనే కేంద్రీకృతమైందని గుర్తు చేసిన చిరంజీవి.. ఉమ్మడి రాష్ట్రంలో మిగతా ప్రాంతాలు నిర్లక్ష్యం కావడం వల్లే.. ఆర్థిక, సామాజిక సమతుల్యాలు దెబ్బతిన్నాయన్నారు. ఇప్పటికే 3 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న ఏపీలో.. ఇంకో లక్ష కోట్ల అప్పుతో అమరావతిని నిర్మిస్తే.. ఉత్తరాంధ్ర, రాయలసీమ పరిస్థితి ఏంటి? అని చిరంజీవి ప్రశ్నించారు. కాగా, రాజధాని రైతుల్లో నెలకొన్న అభద్రతాభావాన్ని తొలగించాలని ప్రభుత్వానికి చిరంజీవి విజ్ఞప్తి చేశారు. అలాగే త్రీ కేపిటల్ ఫార్ములాపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అపోహలు, అపార్దాలను నివారించేలా జగన్ ప్రభుత్వం ప్రయత్నం చేయాలని చిరంజీవి కోరారు.
త్రీ కేపిటల్ ఫార్ములాకు చిరంజీవి మద్దతు తెలపడం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరీ ముఖ్యంగా మెగా ఫ్యామిలీ, జనసేన వర్గాల్లో. చిరంజీవి కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. ఒక రకంగా తన తమ్ముడు పవన్ కు అన్న చిరంజీవి మరో షాక్ ఇచ్చారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఎందుకంటే.. మూడు రాజధానుల ప్రతిపాదనపై జనసేనాని పవన్ ఇప్పటికే అభ్యంతరం తెలిపారు. జీఎన్ రావు కమిటీ నివేదికతో ప్రజల్లో అయోమయం, గందరగోళం నెలకొందన్నారు. అభివృద్ధి అంటే నాలుగు ప్రభుత్వ కార్యాలయాలు, నాలుగు భవనాలుగానో భావించడం లేదన్నారు. జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికపై మంత్రిమండలి నిర్ణయం కోసం వేచి చూస్తున్నామని పవన్ తెలిపారు. కేబినెట్ నిర్ణయం తర్వాతే మా నిర్ణయాన్ని ప్రజల ముందు ఉంచుతామన్నారు జనసేనాని.
పవన్ వైఖరి ఇలా ఉంటే.. ఆయన అన్న చిరంజీవి వైఖరి మరోలా ఉంది. చిరంజీవి త్రీ కేపిటల్ ఫార్ములాకు మద్దతు తెలిపారు. దీంతో మూడు రాజధానుల ప్రతిపాదనపై మెగా ఫ్యామిలీలో భిన్నాభిప్రాయాలు ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఇటీవలే జగన్ ప్రభుత్వం దిశ చట్టం తీసుకొచ్చింది. దీనిపై స్పందించిన చిరంజీవి.. దిశ చట్టాన్ని తీసుకొచ్చిన సీఎం జగన్ ను ప్రశంసించారు. జగన్ నిర్ణయం అభినందనీయం అన్నారు. మహిళల భద్రత కోసం దిశ లాంటి చట్టాలు చాలా అవసరం అని చిరంజీవి అన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు త్రీ కేపిటల్ ఫార్ములాను స్వాగతించి.. జనసేన వర్గాల్లో చర్చకు తెరలేపారు చిరంజీవి.
* త్రీ కేపిటల్ ఫార్ములాపై మెగా ఫ్యామిలీలో భిన్నాభిప్రాయాలు
* మూడు రాజధానుల ప్రతిపాదనపై పవన్ అభ్యంతరం
* అభివృద్ధి అంటే నాలుగు ప్రభుత్వ కార్యాలయాలు, నాలుగు భవనాలుగానో భావించడం లేదన్న పవన్
* మూడు రాజధానుల ప్రతిపాదనకు చిరంజీవి మద్దతు
* మూడు రాజధానుల ప్రతిపాదనను అందరూ స్వాగతించాలని చిరంజీవి పిలుపు
* అధికార, పరిపాలన వికేంద్రీకరణతోనే అభివృద్ది సాధ్యమన్న చిరంజీవి