TTD: తిరుమలలో కొత్త రూల్స్.. ఫాలో కావాల్సిందే..

కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక.. తిరుమలలో పరిస్థితులపై ప్రత్యేకంగా దృష్టిసారించారు

TTD: తిరుమలలో కొత్త రూల్స్.. ఫాలో కావాల్సిందే..

Tirumala Tirupati Devasthanam

Updated On : March 25, 2025 / 8:27 AM IST

Tirumala Tirupati Devasthanam: తిరుమల.. కలియుగ దైవం కొలువుండే చోటు. కొన్ని సెకన్ల పాటు.. వెంకటేశ్వర స్వామిని చూస్తే చాలు జన్మ పునీతం అనుకునే భక్తులు ఎందరో! దేశం నుంచే కాదు.. ప్రపంచవ్యాప్తంగా భక్తులు తిరుమలకు పోటెత్తుతుంటారు. అలాంటి తిరుమలలో ఐదేళ్లు విధ్వంసం జరిగిందని.. పవిత్రతకు భంగం కలిగిందని.. దాన్ని కాపాడడమే లక్ష్యం అంటోంది కూటమి సర్కార్‌. సీఎం చంద్రబాబు టాప్ ప్రియారిటిగా ఉన్న టీటీడీలో పాలన అత్యంత పారదర్శకంగా ఉండాలన్నదే లక్ష్యం. అసలు తిరుమల కొండపై ఉన్న సమస్యలు ఏంటి.. చెక్ పెట్టేందుకు ఎలా రెడీ అవుతున్నారు.

 

తిరుమల ప్రక్షాళనపై చంద్రబాబు దృష్టి..
కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న స్థలం.. మాఢ వీధుల్లో ఆ మాధవుడు స్వయంగా తిరుగుతాడని.. ఆశీస్సులు అందిస్తాడని భక్తుల నమ్మకం. అలపిరి నుంచి తిరుమల వరకు.. భక్తుల్లో ఒకడిలా.. భక్తులకోసం ఒకడిలా.. ఆ దైవం ఎప్పుడూ వెన్నంటే ఉంటుందనే విశ్వాసం చాలామందిది. కొన్ని క్షణాల పాటు.. వెంకన్న దర్శనంకోసం దేశవిదేశాల నుంచి వచ్చేది అందుకే. ఐతే అలాంటి దైవం కొలువైన తిరుమల కొండపై.. ఐదేళ్లు అపచారం జరిగిందని.. పవిత్రతకు భంగం కలిగిందని.. కూటమి సర్కార్ మొదటి నుంచి ఆరోపిస్తోంది. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు తీసుకున్న తర్వాత.. తిరుమల ప్రక్షాళనపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. దీంతో ప్రసాదాల తయారీలో నాణ్యత, భక్తులకు అందించే సేవలు.. గతంతో కంపేర్ చేస్తే మెరుగుపడినట్లు భక్తులు చెప్తున్నారు. ఐతే ఇప్పుడు తిరుమల పవిత్రతను కాపాడేలా మరిన్ని కీలక నిర్ణయాలకు సిద్ధం అవుతున్నారు.

 

ఆస్తులను కాపాడటమే లక్ష్యం..
ఏడుకొండల్లో ఎలాంటి అపవిత్ర కార్యక్రమాలు జరగకూడదన్నది చంద్రబాబు లక్ష్యం. టీటీడీ చైర్మన్, ఈవోతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించిన ఆయన.. దేశంలోని అన్ని రాష్ట్రాలతోపాటు.. హిందువులు ఎక్కువ ఉండే విదేశాల్లోనూ ఆలయాలను నిర్మించే ఆలోచన ఉందని ప్రకటించారు. ఏడుకొండలను ఆనుకొని గతంలో ముంతాజ్ హోటల్‌కు ఇచ్చిన అనుమతులు రద్దు చేస్తున్నట్లు చెప్పారు. వ్యక్తిగత ప్రయోజనాలకు చోటు లేదని.. వేంకటేశ్వరస్వామి ఆస్తులను కాపాడటమే తమ లక్ష్యమని క్లియర్‌కట్‌గా చెప్పారు. గత ఐదేళ్లలో ఎన్నో దారుణాలు జరిగాయని.. తిరుమల ప్రక్షాళన చేపడతామన్న మాట ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఐతే ఇదంతా ఎలా ఉన్నా.. ఇప్పుడు తిరుమల కొండపై సమస్యలివే అంటూ.. కొన్ని విషయాలు తెరమీదకు వస్తున్నాయ్. దీంతో టీటీడీ అలర్ట్ అయింది.

 

భక్తుల అభిప్రాయాలు సేకరించి లోపాలపై ఆరా..
కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక.. తిరుమలలో పరిస్థితులపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. శ్రీవారి దర్శనానికి వచ్చిన వారి అభిప్రాయాలు సేకరించి.. ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి.. భక్తుల సమస్యలు ఆరా తీసి.. దానికి అనుగుణంగా మార్పులు చేస్తున్నారు. మరికొన్ని అంశాలపై అధికారులతో చర్చించి రానున్న రోజుల్లో తప్పులు జరగకుండా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. ఇక తిరుమలలో డ్రోన్లు ఎగరేయడం, ఫోన్‌తో ఆలయం లోపలకు వెళ్లి వీడియో తీయడంలాంటి భద్రతా లోపాలు గతంలో వెలుగుచూశాయ్. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో భద్రత ఏర్పాటుకు.. గతంలో డీజీపీ హరీష్‌కుమార్‌గుప్తా ఆధ్వర్యంలోని బృందం సూచనలు చేసింది. ఏఐని ఉపయోగించి సీసీ కెమెరాలకు లింక్ చేస్తామన్నారు. ఆలయ ప్రవేశ మార్గంలోని బయోమెట్రిక్‌ సమీపంలో.. ఆక్టోపస్‌ క్విక్‌ రియాక్షన్‌ టీమ్ ఛాంబర్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటిని అమలు చేయడంతో పాటు.. యాంటీ డ్రోన్‌ సాంకేతికతను అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉంది.

 

భక్తులకు భద్రత..
ఇక తిరుమలలో మందుబాబుల వీరంగం పెరిగింది. మాడవీధిలో ఒకరు.. డీటైప్‌ క్వార్టర్స్‌ దగ్గర ఇద్దరు యువకులు మద్యం మత్తులో పోలీసులకే చుక్కులు చూపించారు. నిర్మాణ కూలీలు పాచికాల్వ గంగమ్మ ఆలయం.. శ్మశానవాటిక సమీపంలో తాత్కాలిక నివాసాలు వేసుకొని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వారి వాహనాల్లో మద్యం వస్తుందనే ఆరోపణలు ఉన్నాయ్. ఇక అలిపిరి, తిరుమల నడక మార్గంలో తరచూ చిరుత పులులు, ఎలుగుబంట్లు లాంటి వన్యప్రాణులు సంచరిస్తున్నాయ్. ఈ మధ్య చిరుతల రాకపోకలు పెరిగాయ్‌. గతంలో ఓ బాలుడిపై చిరుత దాడి చేయడం, ఓ బాలికను చంపేసిన ఘటన సంచలనంగా మారింది. దీంతో అప్పట్లో వన్యప్రాణుల నుంచి భక్తులను ఎలా రక్షించాలనే అంశంపై కమిటీని వేశారు. ఎలివేటెడ్‌ ఫుట్‌పాస్, ఓవర్‌పాస్‌ నిర్మాణంపైనా సమాలోచనలు జరిపారు. దీనిపై ఇంకా కసరత్తు జరుగుతోంది. సాధ్యమైనంత త్వరగా అమలు చేస్తే మంచిదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.

 

సమస్యలకు చెక్ పెట్టేలా..
కొండపై ఉన్న సమస్యలకు చెక్ పెట్టడంతో పాటు.. భక్తుల భద్రతకు పెద్దపీట వేసేలా పాలకమండలి నిర్ణయాలు తీసుకుంటోంది. ఇక కూటమి సర్కార్‌కు.. టీటీడీ చాలా కీలకం. దీంతో ఏ సమస్య ఎలాంటిదైనా.. భారీ పరిష్కారం చూపించేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. వెంకటాద్రి నిలయం అంటే.. పరమ పవిత్రం. భక్తికి, ముక్తికి ఆధ్యాత్మికత క్షేత్రం. కలియుగ వైకుంఠవాసుడు కొలువైన ఇలవైకుంఠంగా పేరుగాంచిన పుణ్యస్థలం. అలాంటి చోట.. ఏ చిన్న పొరపాటు, సమస్య కూడా ఉండకూడదు అనే లక్ష్యంగా టీటీడీ, ఏపీ సర్కార్ అడుగులు వేస్తోంది. పాలకమండలి నిర్ణయాలు కూడా అదే దిశలో కనిపించాయ్.

 

తిరుమల విజన్ 2047..
కొండపై ఏ చిన్న పొరపాటు జరగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సమస్య ఏదైనా.. దృష్టికి వచ్చిన వెంటనే యాక్షన్‌లోకి దిగుతున్నారు. కొండపై అనధికారికంగా ఉన్న వారిని తిరుపతికి పంపించేస్తున్నారు. ఇక భక్తుల వసతులు, భద్రత విషయంలో టీడీపీ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. స్వర్ణాంధ్ర విజన్ 2047కు అనుగుణంగా తిరుపతిలో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి, పర్యావరణ నిర్వహణ, వారసత్వ పరిరక్షణపై దృష్టి సారించే ప్రణాళిక‌తో తిరుమల విజన్ 2047 ప్రారంభించింది. తిరుమల అభివృద్ధిలో సంప్రదాయాన్ని, ఆధునికత‌తో సమతుల్యం చేసుకోవాలని సీఎం చంద్రబాబు సూచనల మేరకు.. టీటీడీ లక్ష్యాలను నిర్దేశించుకుంది. ఇక ఇప్పుడు పాలకమండలి భేటీలోనూ ఇలాంటి నిర్ణయాలే తీసుకుంది.

 

పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు..
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన పాలకమండలి సమావేశంలో.. కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2025-26 సంవత్సరానికి 5వేల 258 కోట్లతో వార్షిక బడ్జెట్‌‌కు పాలకమండలి ఆమోదం తెలిపింది. ముంతాజ్ హోటల్ నిర్మాణానికి వేరేచోట భూమి కేటాయించాలని సీఎం చంద్రబాబు టీటీడీని ఆదేశించగా.. అలిపిరి దగ్గర ఉన్న 35.24 ఎకరాలతో పాటు.. 15ఎకరాల టూరిజం భూమిని టీటీడీ స్వాధీనం చేసుకొని.. ప్రత్యామ్నాయంగా 50ఎకరాల భూమిని మరో ప్రదేశంలో ప్రభుత్వానికి కేటాయించనుంది. ఇక మనదేశంలోనేకాక ఇతర దేశాల్లోనూ శ్రీవారి ఆలయాలను నిర్మిస్తామని టీటీడీ ప్రకటించింది. శ్రీవాణి ట్రస్టుతో పాటు నూతనంగా ఏర్పాటు చేయబోయే మరో ట్రస్టు ద్వారా వచ్చే విరాళాలతో ఆలయాలను నిర్మిస్తామని చైర్మన్‌ బీఆర్ఎస్ నాయుడు తెలిపారు. శ్రీవారి ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా ప్రత్యేకంగా కమిటీని నియమిస్తున్నామని.. శ్రీవారి ఆస్తులకు సంబంధించి న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

 

అన్యమత ఉద్యోగుల తొలగింపు..
టీటీడీలో అన్యమత ఉద్యోగస్తులను తొలగించబోతున్నారు. ఇక పోటు కార్మికులకు జీఎస్టీ భారం లేకుండా.. 43వేల రూపాయల జీతం చెల్లించేలా నిర్ణయం తీసుకున్నారు. సైన్స్ సిటీకి టీటీడీ కేటాయించిన 20 ఏకరాల స్థలాలను రద్దు చేశారు. టీటీడీ ఉద్యోగులకు మూడు నెలలకు ఒక్కసారి సుపథం ద్వారా దర్శనం కల్పించబోతున్నారు. లైసెన్స్ లేని హ్యాకర్ల నిర్మూలనకు రెవెన్యూ, విజిలెన్స్ శాఖ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇక కొండపై వీఐపీ సంస్కృతి చుట్టూ చర్చ జరుగుతున్న వేళ.. టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. వీఐపీ బ్రేక్ దర్శన సమయాల్లో త్వరలో మార్పు చేయబోతున్నారు. ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు ప్రయోగాత్మకంగా ట్రయల్ నిర్వహించాలని నిర్ణయించారు. ఇక అటు కొండపై 15వందల గదుల మరమ్మతులకు 26 కోట్లు విడుదల చేశారు.

 

గతకంటే ఎక్కువగా వార్షిక బడ్జెట్..
5వేల 258 కోట్లతో 2025-26 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టగా.. గడిచిన బడ్జెట్‌తో కంపేర్ చేస్తే 78.83 కోట్లు ఎక్కువ. అనవసరమైన కేటాయింపులు తగ్గించి.. భక్తులకు మేలు చేసి, హిందూ ధర్మ వ్యాప్తి చెందేలా బడ్జెట్ రూపొందించారు. ఇక వేసవి సెలవులు కావడంతో.. తిరుమలకు భక్తుల రద్దీ పెరిగే అవకాశాలు ఉన్నాయ్. దానికి సంబంధించి కూడా పాలకమండలి భేటీలో సుధీర్ఘంగా చర్చించారు. ఓవరాల్‌గా తిరుమల కొండపై ప్రక్షాళన చేయడం.. పవిత్రతను కాపాడడమే లక్ష్యం అంటున్న టీటీడీ.. సీఎం చంద్రబాబు సూచనలతో కీలక నిర్ణయాలకు రెడీ అవుతోంది. పాలకమండలి నిర్ణయాలు సూచిస్తోంది అదే.