AP Budget 2025 : బడ్జెట్ పై సీఎం చంద్రబాబు ఫోకస్.. ఆ మూడు పథకాలకు ప్రాధాన్యం..
ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమై బడ్జెట్ కూర్పుపై సమీక్షించారు.

CM Chandrababu Naidu
AP Budget 2025 : ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 28వ తేదీన ఏపీ బడ్జెట్ ను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టేనుంది. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమై బడ్జెట్ కూర్పుపై సమీక్షించారు. సంక్షేమం, అభివృద్ధి సమ ప్రాధాన్యమిస్తూ 15శాతం వృద్ధి సాధనే లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పనపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాల అమలుపై చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. ఈ ఏడాది నుంచే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని, అందుకు తగిన విధంగా బడ్జెట్ లో కేటాయింపులు చేయాలని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావులకు చంద్రబాబు సూచించినట్లు తెలిసింది. ముఖ్యంగా మూడు పథకాలకు త్వరలో ప్రభుత్వం శ్రీకారం చుట్టనున్న నేపథ్యంలో వాటికి కేటాయింపుల విషయంపైనా చంద్రబాబు ప్రస్తావించినట్లు తెలిసింది.
Also Read: Vallabhaneni Vamsi: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్.. ఏ కేసులో అరెస్టు చేశారంటే..?
కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారి పూర్తి బడ్జెట్ ను అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టబోతున్నారు. ముఖ్యంగా సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా తల్లికి వందనం, అన్నదాతగా సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాలకు కొత్త ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఇప్పటికే పింఛన్ మొత్తాన్ని పంపిణీ చేస్తుండటంతోపాటు దీపం-2, అన్న క్యాంటీన్లను ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది. ప్రారంభించిన పథకాలకుతోడు త్వరలో ప్రారంభించనున్న మూడు పథకాలకు కూడా బడ్జెట్ లో పెద్దపీట వేసే అవకాశం ఉంది.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత నూతన ఇసుక విధానాన్ని అమలు చేసింది. దీంతో ఆదాయం తగ్గింది. ఈ నేపథ్యంలో నిధుల సమీకరణపై చంద్రబాబు దృష్టిపెట్టారు. పోలవరం, అమరావతి వంటి కీలక ప్రాజెక్టులకు కేంద్రం సాయం చేస్తోంది. ఇది కొంతమేర ఊరటనిస్తోంది. అయితే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ప్రత్యేక సాయం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రాన్ని కోరుతున్నారు. ఇదిలాఉంటే.. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2.94లక్షల కోట్లతో గతేడాది నవంబర్ నెలలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈనెల 28న ప్రవేశపెట్టబోయే బడ్జెట్ రూ. మూడు లక్షల కోట్లు దాటే అవకాశం ఉందని తెలుస్తోంది.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు నేడు తన ఉండవల్లి నివాసంలో ఆర్ధిక శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఆర్ధిక మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్, ఉన్నతాధికారులు హాజరైన ఈ సమావేశంలో రాష్ట్ర బడ్జెట్ ప్రాధాన్యతలపై సమీక్ష నిర్వహించారు.#AndhraPradesh pic.twitter.com/S55g09IwpL
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) February 12, 2025