ఏపీలో వరద బీభత్సం.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు కీలక విన్నపం

రాష్ట్రంలో వరద సహాయక చర్యలను కేంద్ర మంత్రికి వివరించారు చంద్రబాబు.

ఏపీలో వరద బీభత్సం.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు కీలక విన్నపం

Cm Chandrababu Talks With Amit Shah (Photo Credit : Facebook, Google)

Updated On : September 1, 2024 / 9:24 PM IST

Ap Rains : భారీ వర్షాలు, వరదలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. పలు జిల్లాల్లో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. ఊళ్లకు ఊళ్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. జనజీవనం స్థంభించిపోయింది. ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ పరిస్థితుల్లో సీఎం చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఫోన్ లో మాట్లాడారు.

రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం అత్యవసరంగా పవర్ బోట్లు రాష్ట్రానికి తెప్పించే అంశంపై చర్చించారు చంద్రబాబు. వరద సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ ద్వారా పవర్ బోట్లు పంపాలని అమిత్ షాను కోరారు. రాష్ట్రంలో వరద సహాయక చర్యలను కేంద్ర మంత్రికి వివరించారు చంద్రబాబు. అవసరమైన సాయం చేస్తామని చంద్రబాబుకు హామీ ఇచ్చారు అమిత్ షా. హోం సెక్రటరీ ద్వారా తక్షణం అవసరమైన సహాయం అందేలా చేస్తామని ఆయన చెప్పారు.

Also Read : నీట మునిగిన కాలనీలు, స్తంభించిన జనజీవనం.. విజయవాడలో వరద బీభత్సం

చంద్రబాబు విన్నపంతో హోం సెక్రటరీ స్పందించింది. 6 ఎన్డీఆర్ఎఫ్ టీమ్ లను ఇతర రాష్ట్రాల నుండి తక్షణమే ఏపీకి పంపుతున్నట్లు హోం సెక్రటరీ తెలిపింది. ఒక్కో ఎన్డీఆర్ఎఫ్ టీమ్ లో 25 మంది సిబ్బంది ఉంటారు. ఒక్కో టీమ్ కు నాలుగు పవర్ బోట్లు ఇస్తారు. ఇవన్నీ రేపు (సెప్టెంబర్ 2) ఉదయంలోపు విజయవాడకు చేరుకుంటాయని హోం సెక్రటరీ తెలిపింది. మొత్తం 40 పవర్ బోట్లు రాష్ట్రానికి పంపుతున్నట్లు హోం సెక్రటరీ వెల్లడించింది. వాయు మార్గంలో మరో 4 ఎన్డీఆర్ఎఫ్ టీమ్ లను రేపు రాష్ట్రానికి పంపుతున్నట్లు హోం సెక్రటరీ తెలిపింది. అలాగే సహాయక చర్యలకు 6 హెలికాఫ్టర్లు పంపుతున్నట్లు తెలిపింది. రేపటి నుండి హెలికాఫ్టర్లు సహాయక చర్యల్లో పాల్గొననున్నాయి.