ఏపీలో పింఛన్ల పంపిణీ షురూ.. లబ్ధిదారులకు స్వయంగా అందజేసిన సీఎం చంద్రబాబు

ఏపీలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం షురూ అయింది. మంగళగిరి నియోజకవర్గం పెనుమాక గ్రామంలో లబ్ధిదారులకు చంద్రబాబు పింఛన్లు అందజేశారు.

ఏపీలో పింఛన్ల పంపిణీ షురూ.. లబ్ధిదారులకు స్వయంగా అందజేసిన సీఎం చంద్రబాబు

cm Chandrababu naidu

CM Chandrababu Pensions Distribution : ఏపీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం షురూ అయింది. కూటమి ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు పింఛన్ రూ. 4వేలతో పాటు.. గత మూడు నెలలకు సంబంధించిన రూ.3వేలు మొత్తం రూ. 7వేల పింఛన్ ను అర్హులైన లబ్ధిదారులకు రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అందిస్తున్నారు. ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం ఉదయం ప్రారంభించారు. మంగళగిరి నియోజకవర్గం పెనుమాక గ్రామంలో చంద్రబాబు పర్యటించారు. లబ్ధిదారుల ఇంటింటికి తిరుగుతూ పింఛన్లు అందజేశారు. లబ్ధిదారుల కుటుంబంతో మాట్లాడారు. తొలి పింఛన్ ను బానావత్ పాములు నాయక్ కు చంద్రబాబు అందజేశారు. చంద్రబాబు వెంట మంత్రి లోకేశ్, ఇతర అధికారులు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 65.31 లక్షల మందికి పింఛన్ల పంపిణీకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 4,408 కోట్లు విడుదల చేసింది. పింఛన్ల పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు రూ. 819 కోట్ల అదనపు ఖర్చు కానుంది.

Also Read : అరకు కాఫీపై ప్రధాని మోదీ ప్రశంసలు.. సీఎం చంద్రబాబు ఏమన్నారంటే..

పెనుమాకలో బాణావతు పాములు నాయక్ ఇంటి కుటుంబ సభ్యులకు స్వయంగా ఫించన్ ను చంద్ర‌బాబు అంద‌జేశారు. వారు నివాసం ఉంటున్న పూరిగూడిసెలోనే అరగంటకుపైగా ఉండి వారి యోగక్షేమాలు ఆడిగి తెలుసుకున్నారు. ఎన్ని ఆర్థిక కష్టాలుఉన్నా పిల్లల్ని చదివిస్తున్న తీరును చంద్ర‌బాబు అభినందించారు. ఇప్పుడు చెప్పించే చదువే బిడ్డల భవిష్యత్ కు ఉపయోగపడుతుంద‌ని అన్నారు. బాణావ‌తు పాములు ఇంటి స్థితిగతులు చూసి చంద్ర‌బాబు చలించిపోయారు. ప్రభుత్వం తరఫున ఇల్లు క‌ట్టించే చర్యలు తీసుకోవాలని అధికారులను చంద్ర‌బాబు ఆదేశించారు. పింఛన్ ఇవ్వటంతోపాటు ప్రత్యామ్నాయ ఆదాయం పెంచే ఆలోచనలు చేస్తున్నానని చంద్రబాబు అన్నారు. పేదల ఆదాయం పెంచి, ఖర్చులు తగ్గించి, జీవితాలు బాగుపడేలా వినూత్న ఆలోచనలు చేస్తున్నట్లు తెలిపారు. అంత‌కుముందు గుమ్మాల వద్ద ఎదురొచ్చి చంద్రబాబు, లోకేష్ లకు హారతులు ఇచ్చి మహిళలు స్వాగ‌తం ప‌లికారు.