మరో నెల : కిలో ఉల్లిగడ్డ రూ. 25కే

ఏపీలో కిలో ఉల్లిగడ్డను రూ. 25కే విక్రయించాలని సీఎం జగన్ నిర్ణయించారు. రైతు బజార్లలో ఇప్పటికే ఈ ధరకు విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. దీనిని మరో నెల రోజుల పాటు కొనసాగించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. 2019, నవంబర్ 21వ తేదీ గురువారం మార్కెటింగ్ శాఖ అధికారులతో ఆయన సమీక్ష జరిపారు. ఉల్లిగడ్డ ధరలపై ప్రధానంగా చర్చించారు. మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా మరో నెల రోజుల పాటు రైతు బజార్లలో ఉల్లి కిలో రూ. 25కే విక్రయించేలా చూడాలని సూచించారు.
ఇందుకు ప్రతి రోజు 150 మెట్రిక్ టన్నుల ఉల్లిని రైతు బజార్లకు సరఫరా చేసే విధంగా చూడాలన్నారు. ధరలు తగ్గేంత వరకు కొనసాగించాలని, అలాగే ఉల్లిగడ్డలను అక్రమంగా నిల్వ చేస్తున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దేశ వ్యాప్తంగా ఉల్లిగడ్డల ధరలు ఆకాశాన్ని అంటున్న సంగతి తెలిసిందే. దీంతో ఏపీ ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టింది. పేద, సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు రైతు బజార్లలో రూ. 25కు ఉల్లిగడ్డలను విక్రయించాలని సీఎం జగన్ ఆదేశించిన సంగతి తెలిసిందే.
ఉల్లి ధర నాణ్యత ప్రకారం కిలో రూ. 62 నుంచి రూ. 75 మధ్య ఉందని, బిడ్డింగ్‌లో కనీస ధర రూ. 53 నుంచి రూ. 62 మధ్య కొనుగోలు చేస్తున్నట్లు సీఎం జగన్‌కు అధికారులు తెలిపారు. రవాణా ఛార్జీలు కలుపుకుంటే…రూ. 70 నుంచి రూ. 72 వరకు అవుతోందని, ఇంత ధర ఉన్నా కిలోకు రూ. 40 నుంచి రూ. 45కి పైబడి రాయితీ ఇచ్చి రైతు బజార్లకు సరఫరా చేయడం జరుగుతోందన్నారు.
Read More : శేషాచలంలో షేర్ ఖాన్ : తిరుమలలో ఇదే ఫస్ట్ టైమ్