ప్రపంచ మత్స్యకార దినోత్సవం : తూర్పుగోదావరిలో సీఎం జగన్ టూర్

ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకొని.. ఏపీ సీఎం జగన్ వైఎస్సార్ మత్స్యకార భరోసా కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. తూర్పుగోదావరి జిల్లా కొమనాపల్లి వేదికగా ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీల మేరకు.. 2 నెలల చేపల వేట నిషేధ కాలంలో ఉన్న మత్స్యకార భృతిని.. జగన్ ప్రభుత్వం 4 వేల నుంచి 10 వేలకు పెంచింది. ఈ ఏడాదికి గానూ సుమారు 15 వేల మంది మత్స్యకారులకు.. ఈ పరిహారం అందించనున్నారు. అదే విధంగా.. ఇంజిన్ బోట్లకు డీజిల్ సబ్సిడీని 6 నుంచి 9 రూపాయలకు పెంచారు. ఎంపిక చేసిన పెట్రోల్ బంకుల్లో.. ప్రతినెలా 300 లీటర్లు సబ్సిడీతో ఇవ్వనున్నారు. చేపల వేట సమయంలో ప్రమాదవశాత్తూ ఎవరైనా చనిపోతే ప్రమాద బీమాను 10 లక్షలకు, అంగవైకల్యం సంభవిస్తే 5 లక్షలకు ప్రభుత్వం పెంచింది.
ఇక.. గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ కార్యకలాపాల ఫలితంగా జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు ఆ సంస్థ ఇవ్వాల్సిన బకాయిల చెల్లింపులో జాప్యం జరగడంతో.. ఆ మొత్తాన్ని ప్రభుత్వమే ఇవ్వనుంది. ఈ మేరకు మత్స్యకారులకు 78 కోట్లు అందజేయనున్నారు. అలాగే ముమ్మిడివరంలో డిగ్రీ కళాశాల నిర్మాణానికి, ఎదుర్లంక ఎస్సీ లంక భూముల్లో 75 కోట్లతో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారు.
ఇంతకంటే ముందు.. ఐ.పోలవరం మండలంలోని పశువుల్లంక – వలసతిప్ప మధ్య గోదావరిపై నిర్మించిన వైఎస్ఆర్ వారధిని సీఎం జగన్ ప్రారంభిస్తారు. తర్వాత.. కొమనాపల్లిలో ఏర్పాటు చేసిన 9 టూరిజం బోటింగ్ గదులకు శంకుస్థాపన చేస్తారు. బహిరంగ సభ తర్వాత.. యానాం చేరుకుని ఇటీవల మరణించిన పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు తండ్రి మల్లాడి సూర్యనారాయణకు శ్రద్ధాంజలి ఘటిస్తారు.
సీఎం జగన్ పర్యటనతో.. ముమ్మిడివరంలో సుమారు వెయ్యిమంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 25 వేల మంది జనం అంచనాతో.. బహిరంగసభకు వైసీపీ నాయకులు ఏర్పాట్లు చేశారు. మంత్రి విశ్వరూప్, కలెక్టర్ మురళీధర్ రెడ్డి, ఎస్పీ అద్నాన్, ఎమ్మెల్యో పొన్నాడ సతీష్ దగ్గరుండి ఏర్పాట్లు పరిశీలించారు. సీఎం సభతో.. కాకినాడ, అమలాపురం రోడ్డులో.. సాయంత్రం 3 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
Read More : పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో తెలియడం లేదు