ఏపీ వరద బాధితులకు నిత్యావసర సరుకులు

  • Published By: madhu ,Published On : October 19, 2020 / 01:40 PM IST
ఏపీ వరద బాధితులకు నిత్యావసర సరుకులు

Updated On : October 19, 2020 / 1:57 PM IST

Commodities for AP flood victims : ఏపీలో వరద బాధితులకు నిత్యావసర సరుకులు అందచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సరుకులు ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వారానికి పైగా వరద ముంపులో ఉన్న ఫ్రాంతాల్లో నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని ఏపీ సర్కార్ 2020, అక్టోబర్ 19వ తేదీ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ సందర్భంగా చర్యలు తీసుకోవాలని కృష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఒక్కో కుటుంబానికి రూ. 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, లీటర్ నూనె, కిలో ఉల్లిగడ్డలు, కిలో ఆలుగడ్డలు ఇవ్వాలని ఆదేశించింది.

గత కొన్ని రోజులుగా ఏపీ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. 2020, అక్టోబర్ 19వ తేదీ సోమవారం, 20వ తేదీ మంగళవారం రోజుల్లో వర్షాలు దంచి కొట్టనున్నాయి. ఈ మేరకు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ తీరానికి దగ్గర్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో 1.5 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.

నాలుగు జిల్లాలకు వర్షం ముంపు పొంచి ఉంది. ప్రధానంగా దక్షిణ కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతోపాటు.. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల పడే చాన్స్‌ ఉంది. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది.

దక్షిణ కోస్తాంధ్రలో సోమవారం ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయి. రాయలసీమకూ వర్షంగండం పొంచి ఉంది. సోమ, మంగళవారం రోజులో సీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్లు కురిసే అవకాశముందని వాతావరణ అధికారులు హెచ్చరించారు.