విశాఖలో సంప్రదాయ, రింగువల మత్స్యకారుల మధ్య వివాదం

విశాఖలో సంప్రదాయ, రింగువల మత్స్యకారుల మధ్య వివాదం

Updated On : December 30, 2020 / 12:13 PM IST

Controversy between traditional and ring fishermen in Visakhapatnam : ప్రకాశం జిల్లా ఘర్షణ సద్దుమణగకముందే విశాఖలోనూ మత్స్యకారుల మధ్య ఉద్రిక్తత ఏర్పడింది. సంప్రదాయ మత్స్యకారులకు, రింగువల ఉపయోగిస్తున్న మత్స్యకారులకు మధ్య విశాఖ సాగరతీరంలో వివాదం తలెత్తింది. వాసవాని పాలెం, పెదజాలరి పేట మత్స్యకారుల మధ్య రింగువల వాడకం విషయంలో ఘర్షణ జరిగింది. రింగ్ వలలతో వేటకు వెళ్తున్న వారిని సంప్రదాయ మత్స్యకారులు అడ్డుకున్నారు.

వారిని వేటకు వెళ్లనీకుండా రింగు వల జాలర్లు అడ్డుకున్నారు. రెండు గ్రామాలకు చెందిన మత్స్యకారులు తీరంలోనే మకాం వేశారు. దీంతో పెద్ద జాలరిపేట దగ్గర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టాయి. సమస్యను పరిష్కరించేందుకు రెండు వర్గాలకు చెందిన మత్స్యకారులతో పోలీసులు చర్చిస్తున్నారు.

మరోవైపు ప్రకాశం జిల్లాలో మత్స్యకార గ్రామాల మధ్య చిచ్చురేపిన వలలపై జిల్లా మత్స్యశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. బల్లవల, ఐలవలలపై తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు నిషేధం కొనసాగుతుందన్నారు. ఈ నిషేధం తక్షణం అమల్లోకి వస్తుందన్నారు. ఐలవల, బల్లవలలపై ఇండియన్ ఫిషరీయాక్ట్ 145 సెక్షన్ ప్రకారం నిర్ణయం తీసుకున్నామని.. ఆదేశాలను ధిక్కరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.