ఏపీలో కరోనా 1935 కొత్త కేసులు..1052 డిశ్చార్జ్

ఏపీలో కరోనా ఆగడం లేదు. రోజు రోజు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కేసులు నమోదవుతున్నా..కోలుకున్న వారి సంఖ్య అధికమవుతోంది. పలు జిల్లాల్లో అత్యధికంగా కేసులు నమోదవుతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
2020, జులై 13వ తేదీ 19, 247 మందికి పరీక్షలు నిర్వహించారు. కొత్తగా 1935 మందికి వైరస్ సోకినట్లు గుర్తించారు. మొత్తం పరీక్షల సంఖ్య 11, 73, 096కి చేరింది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,052 మంది ఆసుపత్రుల నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
మొత్తంగా ఏపీలో కరోనా కేసులు 31, 103కి చేరాయి. తాజాగా 37 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 365 కి చేరింది.
2 వేల 416 కేసులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి సంబంధించినవి కాగా, 432 కేసులు విదేశాల నుంచి వచ్చిన వారివని తెలిపింది. ప్రస్తుతం 14,274 యాక్టివ్ కేసులున్నాయి.
మరోవైపు ఏపీ క్వారంటైన్ విధానంలో మార్పులు చేశారు.
విదేశాల నుంచి ఏపీకి వచ్చే వారికి రాష్ట్ర ప్రభుత్వం విధించే ఏడు రోజుల క్వారంటైన్ తప్పనిసరి.
గల్ఫ్ నుంచి వచ్చిన వారు 14 రోజుల క్వారంటైన్ నుంచి ఏడు రోజులకు కుదింపు.
విదేశాల నుంచి ఏపీకి తిరిగివచ్చి క్వారంటైన్‌లో ఉన్న వారికి ఐదో రోజు, ఏడో రోజు కొవిడ్ టెస్టు చేయాలి.
విమానాశ్రయాల్లోనే స్వాబ్ టెస్టులు చేయాలి. ఆ తర్వాత వారందరికీ 14 రోజుల హోమ్ క్వారంటైన్ వెసులుబాటు కల్పించాలి.
రైళ్ల ద్వారా ఏపీకీ వచ్చే వారిలోనూ ర్యాండమ్‌గా టెస్టులు చేయాలి. వారికీ 14 రోజుల హోమ్ క్వారంటైన్ తప్పనిసరి.
తెలంగాణ, కర్ణాటక మినహా ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న ప్రయాణికులకు 14 రోజుల హోమ్ క్వారంటైన్ తప్పనిసరి.
రాష్ట్ర సరిహద్దుల వద్ద కరోనా పాజిటివ్‌గా తేలిన వ్యక్తులను తక్షణం వేరు చేసి కొవిడ్ ఆస్పత్రులకు తరలించాలి.