తిరుమల శ్రీవారి అర్చకులకు కరోనా పాజిటివ్

తిరుమల శ్రీవారి ఆలయంలో కరోనా కలకలం రేగింది. స్వామివారికి కైంకర్యాలు నిర్వహించే అర్చకులకు కరోనా సోకింది. ఆలయంలో పని చేసే మొత్తం 18 మంది అర్చకులు కరోనా బారిన పడ్డారు. వీరిలో ఒక సీనియర్ అర్చకునికి మెరుగైన చికిత్స అందివ్వడానికి చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం అర్చకులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించింది. ఆలయంలో అర్చకులకు కరోనా సోకడంతో దర్శనాలను నిలిపివేసే యోచనలో టీటీడీ ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.
దేశంలోనూ, రాష్ట్రంలో కరోనా వైరస్ అంతకంతకూ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే టీటీడీ ఉద్యోగుల్లో వందకు పైగా కరోనా కేసులు బయటపడ్డాయి. ఇందులో శ్రీవారి ఆలయంలో పని చేసే అర్చకులకు కూడా కరోనా వైరస్ సోకడం ఇప్పుడు కలకలం రేపుతోంది.
ఇవాళ తిరుమల శ్రీవారి ఆలయంలో పని చేసే ప్రధాన అర్చకులతోపాటు కొందరు అర్చకులు టీటీడీ చైర్మెన్ వైవీ సుబ్బారెడ్డిని కలిశారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. వైవీ సుబ్బారెడ్డి అర్చకులకు భరోసా ఇచ్చారు. అర్చకులకు ఎటువంటి ఇబ్బందులొచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని భరోసా ఇచ్చారు. ఎటువంటి ఇబ్బందులు పడొద్దని అర్చకులకు సూచించారు.
అయితే శ్రీవారి ఆలయంలో పని చేసే అర్చకులకు 14 మందికి కరోనా వచ్చినట్లు ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు చెప్పారు. ఎవరైతే అర్చకులు పని చేస్తున్నారో వారు 50 నుంచి 60 సంవత్సరాలు పైబడిన ఉద్యోగులకు ఇక్కడ డ్యూటీలు వేయొద్దని అర్చకులు కోరారు. దీనికి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా సానుకూలంగా స్పందించారు. వయో భారంతో అర్చక డ్యూటీలు చేయనటువంటి వారు సెలవులు పెట్టి ఇంట్లోనే ఉండచ్చని చెప్పారు.
అందుకు ప్రత్యామ్నాయంగా తిరుపతితోపాటు ఇతర ప్రాంతాల్లో పని చేసే అర్చకులను ఇక్కడి ఆలయంలో కైంకర్యాలు నిర్వహించడానికి డ్యూటీలు వేస్తామని హామీ ఇచ్చారు. బ్రహ్మోత్సవాలు, ఇతర ఉత్సవాలు జరిగే టైమ్ లో బయటి ప్రాంతాల నుంచి అర్చకులను తీసుకొచ్చి తిరుమలలో డ్యూటీలు వేయడం అనేది ఆనవాయితీ. ఆ ఆనవాయితీనే ఇప్పుడు ఇక్కడ పాటిస్తామని ఎవరైనా రెస్టు తీసుకోవాలంటే అటువంటి అర్చకులు రెస్టు తీసుకోవచ్చని చెప్పారు.
శ్రీవారి ఆలయంలో పని చేసే 14 మంది అర్చకులకు కరోనా వైరస్ సోకింది. అలాగే పోర్టులో పని చేసే కొంతమంది కార్మికులకు కూడా వైరస్ సోకడం చర్చనీయాంశంగా మారింది. శ్రీవారి ఆలయంలో గత నెల 11 నుంచి రోజుకు 12 వేల మంది చొప్పున స్వామి వారి దర్శనానికి టీటీడీ అనుమతిస్తుంది.
అయితే 8 వేల నుంచి 9 వేల మంది వరకు స్వామివారిని దర్శించుకుంటున్నారు. కరోనా వ్యాపిస్తున్నప్పటికీ భక్తుల నుంచి ఎటువంటి ఇబ్బంది లేదు. భక్తుల కారణంగా అర్చకులు, సిబ్బందికి కరోనా వ్యాపించలేదని చెబుతున్నారు. తమకు భక్తుల నుంచి కరోనా వైరస్ వ్యాపించలేదని అర్చకులు స్పష్టం చేశారు.