CM Jagan Corona Review : ప్రైవేట్‌లో ఆక్సిజన్ ప్లాంట్లు.. కరోనా కట్టడికి సీఎం జగన్ కీలక ఆదేశాలు
కరోనా నివారణపై సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం

Cm Jagan Corona Review
CM Jagan Corona Review : కరోనా నివారణపై సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం కాన్సన్‌ట్రేటర్లు, డీ-టైప్ సిలెండర్లు, ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ల నిర్వహణపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. దీనికోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలన్నారు. పీహెచ్‌సీలలో ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు ఉంచాలని… జిల్లాల వారీగా వీటి నిర్వహణ కోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించాలని సీఎం సూచించారు. ఏపీఎంఎస్‌ఐడీసీలో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
కరోనా వైరస్ నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్షించారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో జగన్ మాట్లాడారు. వ్యాక్సినేషన్ వేగవంతం చేయడంపై సీఎం జగన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
అలాగే.. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాలని సీఎం జగన్ సూచించారు. 100 బెడ్లు ఉన్న ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తర్వాత మిగిలిన ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుపై దృష్టి పెట్టాలన్నారు. ప్లాంట్ల ఏర్పాటుకు 30 శాతం సబ్సిడీ ఇస్తున్నామని సీఎం గుర్తు చేశా రు.
‘‘ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు అందుబాటులో ఉంచాలి. కోవిడ్ నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం కొనుగోలు చేసిన కాన్సన్‌ట్రేటర్లు, డీ-టైప్ సిలెండర్లు, ఆక్సిజన్ జనరేషన్ (పీఎస్‌ఏ) ప్లాంట్ల నిర్వహణ కోసం ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇందుకోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి. రాష్ట్రంలో జిల్లాల వారీగా నిర్వహణ కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించాలి. జిల్లా విస్తీర్ణం, ఆస్పత్రుల సంఖ్యకు అనుగుణంగా సిబ్బందిని ఏర్పాటు చేయాలి. అవసరమైన శిక్షణనూ వీరికి అందించాలి. ఏపీఎంఎస్‌ఐడీసీలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలి. శిక్షణ అనంతరం వీరిని ఆస్పత్రి మేనేజ్‌మెంట్‌కు అప్పగించాలి. అదే విధంగా.. ఐటీఐ, డిప్లొమాలో దీనికి సంబంధించిన కోర్సులను ప్రవేశపెట్టాలి. ఆస్పత్రుల నిర్వహణలో కీలకమైన ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణ, ఎలక్ట్రికల్, ఏసీ రిపేర్, ప్లంబింగ్‌తో పాటు ఇతర అనుబంధ వైద్య విభాగాల్లో నైపుణ్యాలను అభివృద్ధి చేయాలి. నైపుణ్యం ఉన్న మానవ వనరుల సేవల కారణంగా… ఆస్పత్రుల నిర్వహణ మెరుగ్గా ఉంటుంది. అంతేగాక చాలామందికి ఉద్యోగాలు వస్తాయి’’ అని సీఎం జగన్ అన్నారు.
కొత్త మెడికల్ కాలేజీల కోసం పెండింగ్‌లో ఉన్న భూసేకరణను త్వరగా పూర్తిచేయాలన్న సీఎం.. వ్యాక్సినేషన్‌లో టీచర్లకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వీలైనంత త్వరగా టీచర్లకు వ్యాక్సినేషన్‌ను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. మే, జూన్, జులై నెలల్లో ప్రైవేట్ ఆస్పత్రులకు 43.38 లక్షల డోసులు ఇస్తే.. కేవలం 5,24,347 డోసులు మాత్రమే వాడారని అధికారులు సీఎంకు తెలిపారు. ఈ వ్యాక్సిన్లను ప్రభుత్వానికి ఇస్తే వ్యాక్సినేషన్‌ను వేగంగా ముందుకు సాగుతుందని, దీనిపై మరోసారి కేంద్రానికి లేఖ రాస్తానని సీఎం అన్నారు.