తెలంగాణలో 9.4 రోజులు.. ఏపీలో 10.6 రోజులు.. కరోనా కేసులు రెట్టింపు అయ్యేందుకు పడుతున్న సమయం పెరిగింది
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. ఆ దేశం ఈ దేశం అని కాదు సుమారు 200కు పైగా దేశాల్లో ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. కంటికి కనిపించని ఈ శత్రువు ప్రాణాలు

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. ఆ దేశం ఈ దేశం అని కాదు సుమారు 200కు పైగా దేశాల్లో ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. కంటికి కనిపించని ఈ శత్రువు ప్రాణాలు తీసేస్తోంది. ఇప్పటికీ ఈ మహమ్మారికి వ్యాక్సిన్ లేదు. దీంతో లాక్ డౌన్ అనే ఆయుధాన్ని ప్రభుత్వాలు సంధించాయి. అలాగే స్వీయ నియంత్రణ, సోషల్ డిస్టెన్స్ వంటివి మెయింటేన్ చేస్తూ కరోనాను కట్టడి చేస్తున్నారు.
కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలతో ఫలితాలు:
మన దేశంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా పంజా విసురుతోంది. రోజురోజుకి కేసుల సంఖ్య పెరిగిపోతోంది. దీంతో ప్రభుత్వాలు మరింత అలర్ట్ అయ్యాయి. కరోనా కట్టడికి మరిన్ని చర్యలు చేపట్టాయి. ఇవి మంచి ఫలితాలు ఇస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ కాస్త ఊరటనిచ్చే విషయం చెప్పింది. అదేమిటంటే, కరోనా కేసుల సంఖ్య రెట్టింపు అయ్యేందుకు పడుతున్న సమయం క్రమంగా పెరుగుతోందట. జాతీయ సగటు 7.5 రోజులు ఉండగా.. తెలంగాణలో 9.4 రోజులు, ఏపీలో 10.6 రోజులు ఉందని ఆరోగ్యశాఖ వివరించింది. జాతీయ సగటు కంటే ఎగువన 18 రాష్ట్రాలు ఉన్నాయని తెలిపింది. కరోనా నివారణ, నియంత్రణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటూ వాటిని అమలు చేసేందుకు ఉన్నత స్థాయిలో సమీక్షిస్తున్నట్లు తెలిపింది.
దేశంలో లాక్ డౌన్‌కు ముందు కేసుల రెట్టింపునకు 3.4 రోజులు పట్టేదని, ఏప్రిల్ 19 నాటికి అది 7.5కి చేరిందని తెలిపింది.
రెట్టింపు రేటు 20 రోజుల కంటే తక్కువ ఉన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో
* ఢిల్లీ-8.5 రోజులు
* కర్ణాటక-9.2 రోజులు
* తెలంగాణ-9.4 రోజులు
* ఆంధ్రప్రదేశ్-10.6 రోజులు
* జమ్మూ కశ్మీర్-11.5 రోజులు
* పంజాబ్-13.1 రోజులు
* ఛత్తీస్‌గఢ్-13.3 రోజులు
* తమిళనాడు-14 రోజులు
* బిహార్-16.4 రోజులుగా ఉంది.
20 నుంచి 30 రోజుల మధ్యలో:
రెట్టింపు రేటు 20 రోజుల నుంచి 30 రోజుల మధ్య ఉన్న వాటిలో
* అండమాన్ నికోబార్-20.1 రోజులు
* హరియాణా-21 రోజులు
* హిమాచల్ ప్రదేశ్-24.5 రోజులు
* చండీగఢ్-25.4 రోజులు
* అస్సాం-25.8 రోజులు
* ఉత్తరాఖండ్-26.6 రోజులు
* లడఖ్-26.6 రోజులుగా ఉంది.
రెట్టింపు రేటు 30 రోజుల కంటే ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఒడిశా-39.8 రోజులు, కేరళ-72.2 రోజులుగా ఉంది. గోవాలో కరోనా రోగులందరూ కోలుకున్న తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది. మహే (పుదుచ్చేరి), కొడగు (కర్ణాటక) – పౌడిగర్వాల్ (ఉత్తరాఖండ్)ల్లో గత 28 రోజులలో కేసులు నమోదు కాలేదు.