ఏపీలో 21కి చేరిన కరోనా కేసులు…ఇద్దరు విశాఖ వాసులకు వైరస్

ఏపీలో కరోనా వైరస్ క్రమంగా విస్తరిస్తోంది. తాజాగా మరో రెండు కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 21కి చేరింది.

  • Published By: veegamteam ,Published On : March 29, 2020 / 06:19 PM IST
ఏపీలో 21కి చేరిన కరోనా కేసులు…ఇద్దరు విశాఖ వాసులకు వైరస్

Updated On : March 29, 2020 / 6:19 PM IST

ఏపీలో కరోనా వైరస్ క్రమంగా విస్తరిస్తోంది. తాజాగా మరో రెండు కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 21కి చేరింది.

ఏపీలో కరోనా వైరస్ క్రమంగా విస్తరిస్తోంది. తాజాగా మరో రెండు కొత్త కేసులు నమోదయ్యాయి. ఇద్దరు విశాఖ వాసులకు కరోనా సోకినట్లు నిర్ధారించారు. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 21కి చేరింది. ఈనెల 17న బర్మింగ్‌ హామ్‌ నుంచి వచ్చిన వ్యక్తికి చెందిన సంబంధీకులకు కరోనా సోకినట్లు గుర్తించారు. బాధితులు ఇప్పటికే హోమ్ క్వారంటైన్ లో ఉండగా…  కరోనా నిర్ధారణ తర్వాత వారిని విశాఖలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఏపీని కరోనా బెంబేలెత్తిస్తోంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రెండేసి చొప్పున బయటపడ్డాయి. ఇక కర్నూలు , ప్రకాశం జిల్లాల్లో ఒక్కో కేసు నమోదయ్యింది. దీంతో ఒక్కరోజే ఆరుగురికి పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. ఇక విశాఖలో ఇవాళ 116 మంది కరోనా నెగిటివ్‌ రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. ప్రజలందరూ సోషల్ డిస్టెన్స్‌ పాటించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఏపీ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 21కి చేరడంతో  సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించి… ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. మరోవైపు కరోనా గురించి రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమలు నిర్వహిస్తున్నా…పలు జిల్లాలను కరోనా భయాలు ఇంకా వెంటాడుతున్నాయి. 

ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో… మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం జగన్. లాక్‌డౌన్‌ను మరింత పటిష్టంగా అమలు చేయాలని నిర్ణయించారు. అర్బన్‌ ప్రాంతాల్లో నిత్యావసరాల కొనుగోలు కోసం ప్రస్తుతం పాటిస్తున్న సమయాన్ని కుదించారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు జగన్.  

సమీక్షలో సీఎం సూచనల మేరకు పనిచేస్తామన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. పట్టణ ప్రాంతంలోనే కరోనా ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నట్లు గుర్తించామన్నారు. ప్రతిఒక్కరూ తమవంతు బాధ్యతగా వ్యవహరిస్తూ ప్రభుత్వం చెప్పినట్లు నడుచుకోవాలన్నారు. ఏపీలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రి ఆళ్లనాని. ప్రజలు నిత్యావసరాల కొనుగోలు సమయాన్ని కుదించామని వెల్లడించారు. 

ప్రకాశం జిల్లా చీరాలలో కరోనా భయాలు అధికారులకు.. స్థానికులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. కరోనా వచ్చిన దంపతులతో వెళ్లిన బృందం సభ్యులపై అధికారులు ఆరా తీస్తున్నారు. వెంటవెళ్లిన వారిని కనుగొనేందుకు జల్లెడ పడుతున్నారు. ఇప్పటికే చీరాల, పేరాలలో ఇద్దరు, కనిగిరిలో ఏడుగురు, కందుకూరులో నలుగురు.. చీమకుర్తిలో ఒకరు, వెలిగండ్లలో ఒకరిని అధికారులు గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 60 మంది ఢిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నారు. అందరినీ క్వారంటైన్‌ వార్డుకు తరలించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. 

మొత్తంగా… వైరస్‌ను కట్టడి చేసేందుకు విదేశాల నుంచి వచ్చిన వారిపై ఏపీ పోలీసులు పటిష్ఠ నిఘా పెట్టారు. క్వారంటైన్ యాప్‌ తయారు చేసి.. హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్న వారి కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ప్రభుత్వ నిర్ణయాలకు సహకరించాలని అధికారులు, వైద్యులు ప్రజలను కోరుతున్నారు.   
 

See Also | ప్రైవేట్ ల్యాబ్స్ లోనూ కరోనా పరీక్షలు…ప్రభుత్వం కీలక నిర్ణయం