Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్.. వైసీపీ ఎంపీ కుమారుడికి ఎదురుదెబ్బ
Delhi Liquor Scam : లిక్కర్ స్కాంలో ఈడీ నమోదు చేసిన కేసులో రాఘవ అరెస్ట్ అయ్యారు. ఇప్పటికే ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన చార్జిషీటులో రాఘవ, మాగుంట శ్రీనివాస్ రెడ్డిపై తీవ్ర అభియోగాలు మోపింది ఈడీ.

Magunta Raghava Reddy (Photo : Google)
Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవకు కోర్టులో చుక్కెదురైంది. మాగుంట రాఘవ బెయిల్ పిటిషన్ ను రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. లిక్కర్ స్కాంలో ఈడీ నమోదు చేసిన కేసులో రాఘవ అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సౌత్ గ్రూప్ తరపున చెల్లించిన రూ.100 కోట్ల ముడుపుల వ్యవహారంలో మాగుంట రాఘవ రెడ్డి పాత్ర ఉందనేది ఈడీ వాదన. ఇప్పటికే ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన చార్జిషీటులో మాగుంట శ్రీనివాసులు రెడ్డితో పాటు రాఘవపై తీవ్ర అభియోగాలు మోపింది ఈడీ (ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్).
ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని ఈడీ అరెస్ట్ చేసింది. వారిలో కొందరు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉండటం హాట్ టాపిక్ గా మారింది.
కాగా, లిక్కర్ స్కామ్ లో వచ్చిన ఆరోపణలను గతంలో మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఖండించారు. కేవలం తమ బంధువుల్లో మాగుంట పేరు ఉందనే ఆరోపణలు వచ్చాయని, అసలు తనతో పాటు తన కుమారుడు ఢిల్లీ లిక్కర్ బిజినెస్ లో డైరెక్టర్లుగా లేమని చెప్పారు. తాము లిక్కర్ వ్యాపారంలో ఉన్నప్పటికీ.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో తమకు సంబంధం లేదన్నారు. రాజకీయాల్లో కానీ వ్యాపారాల్లో తాము ఏనాడు అవినీతి, అక్రమాలకు పాల్పడలేదని ఎంపీ మాగుంట అన్నారు.
కాగా, మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవ వచ్చే ఎన్నికల్లో పోటీ చెయ్యబోతున్నారని సమాచారం. ఇంతలో రాఘవ అరెస్ట్ కావడం కలకలం రేపింది. ఏపీ రాజకీయాల్లో చర్చకు దారితీసింది.