కరోనా విజృంభిస్తోంది : ఉద్యోగులు ఇళ్ల నుంచి పనిచేసుకునే వీలు కల్పించాలని ప్రైవేటు సెక్టార్ ను కోరిన కేంద్ర ఆరోగ్యశాఖ

కరోనా వైరస్(COVID-19)వ్యాప్తిని నిరోధించేందుకు ప్రైవేట్ సెక్టార్ ఆర్గనైజేషన్లు అన్నీ వర్క్ ఫ్రం హోం(ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయడం)ను ప్రోత్సహించాలని ఇవాళ(మార్చి-16,2020) కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ సూచించింది. సాధ్యమైన అన్ని చోట్లా ఉద్యోగులను ఇంటి నుండి పని చేయడానికి అనుమతించమని… ప్రైవేటు రంగ సంస్థలను, యజమానులను మేము ఎంకరేజ్ చేస్తున్నాము అని ఆరోగ్యమంత్రిత్వశాఖ ప్రతినిధి ఒకరు మీడియా సమావేశంలో తెలిపారు.
అంతేకాకుండా దేశవ్యాప్తంగా ప్రజలందరూ సాధ్యమైనంతవరకు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని ఆయన సూచించారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు పలు చర్యలు తీసుకోబడ్డాయని ఆయన తెలిపారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య నెమ్మదిగా పెరిగిపోతున్నాయి. దేశంలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 114కి చేరిందని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ కన్ఫర్మ్ చేసింది.
మరోవైపు కేంద్రఆరోగ్యశాఖ కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ పై సందేహాలు,అనుమానాలు తీర్చేందుకు కొత్త టోల్ ఫ్రీ నెంబర్,ఈ మెయిల్ ఐడీని సోమవారం లాంఛ్ చేసింది. జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1075. హెల్ప్ లైన్ ఈ మెయిల్ ఐడీ..nCOV2019@gmail.com. గతంలో ఉన్న హెల్ప్ లైన్ నెంబర్ 011-23978046కూడా ఆపరేషనల్ లో ఉంటుందని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.