Cyclone Alert : రాగల మూడు రోజుల్లో ఏపీ‌లో భారీ వర్షాలు

దక్షిణ అండమాన్‌ సముద్రంలో ఈనెల 29న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.

Cyclone Alert : రాగల మూడు రోజుల్లో ఏపీ‌లో భారీ వర్షాలు

Rains In Nellore District

Updated On : November 28, 2021 / 12:03 PM IST

Cyclone Alert :  దక్షిణ అండమాన్‌ సముద్రంలో ఈనెల 29న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. తర్వాత 48 గంటల్లో అల్పపీడనం  బలపడి పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణిస్తుందని అధికారులు తెలిపారు.  మరోవైపు శ్రీలంక తీరప్రాంతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో… రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో పలుచోట్ల రాగల రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వారు హెచ్చరించారు.

ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో 7 సెం.మీ నుంచి 20 సెం.మీ వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని…. గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. ఆసమయంలో తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశమున్నందున డిసెంబర్ 1వ వరకు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్ళవద్దని సూచించారు.

మరోవైపు నెల్లూరు జిల్లా  ఆత్మకూరు నియోజకవర్గంలో ఆదివారం తెల్లవారుజాము నుండి కుండపోతగా వర్షం కురుస్తోంది. ఆత్మకూరు, అనంతసాగరం,  మర్రిపాడు, సంగం, ఏఎస్ పేట   మండలాల్లో కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. మళ్లీ కురుస్తున్న భారీ వర్షాలకు   పెన్నా నది పరీవాహక గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. చేజర్ల మండలం గొల్లపల్లి వద్ద   పందల వాగు ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో 10 గ్రామాలకు రాకపోకలు ఆగిపోయాయి.

కడప, చిత్తూరు జిల్లా తిరుపతిలో ఈ రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని  వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కడపలో ఈరోజు తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తోంది. పది రోజుల కిందట కురిసిన భారీ వర్షం నుంచి నగర వాసులు కోలుకోక మునుపే…మళ్లీ వర్షాలు పడటం వారిని కలవరపాటుకు గురిచేస్తోంది.

ఇప్పటికే జిల్లాలోని చెరువులన్నీ నిండు కుండలా మారాయి. చెరువుల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా పోలీసు శాఖ, రెవెన్యూ, అగ్నిమాపక శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలోని ఒంటిమిట్టలో భారీ వర్షం కురుస్తోంది.  కడప నుండి తిరుపతి   రహాదారిలో బాలుపల్లె వద్ద పాత బ్రిడ్జి   కుంగింది.  దీంతో కడప-తిరుపతి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.  ప్రకాశం జిల్లాల్లో కూడా ఈ రోజు తీవ్రమైన వర్షాలు పడనున్నాయి. మధ్యాహ్నం, సాయంకాలం చాలా తీవ్రంగా ఉంటుంది.

అనంతపురం, కర్నూలు జిల్లాల్లో   ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన  తుఫాను కారణంగా గుంటూరు జిల్లాలో ఈరోజు రేపు అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వివేక్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. తుఫాను కారణంగా మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లవద్దని జిల్లా కలెక్టర్  కోరారు.