Montha Cyclone : మొంథా తుపాను.. రద్దు చేసిన రైళ్లు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి? దక్షిణ మధ్య రైల్వే ఏం చెప్పిందంటే?
Montha Cyclone : ఏపీలో మొంథా తుపాను కారణంగా దక్షిణ మధ్య రైల్వే (SCR) జోన్ పరిధిలోని పలు రైళ్లను రైల్వే అధికారులు నిలిపివేసిన విషయం తెలిసిందే.
Cyclone Montha
Montha Cyclone : ఏపీలో మొంథా తుపాను కారణంగా దక్షిణ మధ్య రైల్వే (SCR) జోన్ పరిధిలోని పలు రైళ్లను రైల్వే అధికారులు నిలిపివేసిన విషయం తెలిసిందే. తుపాను కారణంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో రైల్వే పట్టాలు దెబ్బతినే పరిస్థితి.. రైలు పట్టాల పైనుంచి వరద నీరు ప్రవహించే అవకాశం ఉండటంతో ప్రయాణికుల భద్రత దృష్ట్యా రైల్యే అధికారులు పలు రైళ్లను రద్దు చేశారు. భారీ వర్షాలు పడే జిల్లాల పరిధిలోని రూట్లలో వెళ్లే పలు రైళ్లను రద్దు చేశారు. కొన్నింటిని దారి మళ్లించారు.
దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (CPRO) ఎ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. మొంథా తుపాను కారణంగా రైళ్ల రాకపోకలకు గణనీయంగా అంతరాయం కలిగిందని తెలిపారు. మొత్తం 132 రైళ్లు ప్రభావితమయ్యాయని, వీటిలో 107 రైళ్లు రద్దు చేయగా.. ఆరు రైళ్లను దారి మళ్లించామని, 18 రైళ్లను తిరిగి షెడ్యూల్ చేయబడ్డాయని తెలిపారు. ఒకటి పునరుద్ధరించబడింది, ఒకటి తాత్కాలికంగా రద్దు చేయబడిందని ఆయన చెప్పారు.
మొంథా తుపాను ప్రభావంతో తీర ప్రాంతంలో భారీ వర్షాలు, తీవ్రస్థాయిలో ఈదురుగాలుల కారణంగా కాకినాడ, భీమవరం, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్టణం వైపు వెళ్లే రైలు సర్వీసులను నిలిపివేయడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం తుపాను తీరం దాటడంతో బుధవారం సాయంత్రం వరకు తుపాను ప్రభావం తగ్గుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. దీంతో రద్దు చేసిన రైళ్లను రైల్వే శాఖ పునరుద్దరిస్తోంది. ఇందులో భాగంగా హౌరా – సికింద్రాబాద్, హౌరా – ఎస్ఎంవీటీ బెంగళూరు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే పునరుద్దరించింది.
“Bulletin No.16: SCR PR No.605, dt.29.10.2025 on “Restoration of Trains” pic.twitter.com/COR2MbXwIR
— South Central Railway (@SCRailwayIndia) October 29, 2025
బుధవారం సాయంత్రం వరకు మొంథా తుపాను ప్రభావం తగ్గుముఖం పట్టే అవకాశం ఉండటంతో గురువారం ఉదయం వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ట్రాక్‌లను పరిశీలించి.. ఆ తరువాత రద్దు చేసిన రైళ్లను మళ్లీ పునరుద్దరించేందుకు రైల్వే అధికారులు దృష్టిసారించారు. ఇవాళ సాయంత్రం వరకు కొన్ని రైళ్లు, గురువారం మరికొన్ని రైళ్లను పునరుద్దరించే అవకాశం ఉందని రైల్వే అధికారులు తెలిపారు.
