Pawan Kalyan : ఎవరినీ వదిలిపెట్టను..! రేషన్ బియ్యం అక్రమ రవాణపై పవన్ కల్యాణ్ సీరియస్..

నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోర్టు అధికారులపై చర్యలు తప్పవన్నారు పవన్ కల్యాణ్.

Pawan Kalyan : ఎవరినీ వదిలిపెట్టను..! రేషన్ బియ్యం అక్రమ రవాణపై పవన్ కల్యాణ్ సీరియస్..

Updated On : November 29, 2024 / 4:47 PM IST

Pawan Kalyan : కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు, పోర్టు అధికారులపై పవన్ కల్యాణ్ సీరియస్ అయ్యారు. పోర్టులోకి రేషన్ రైస్ ఎలా వస్తోంది అని ఆయన ప్రశ్నించారు. పోర్టులోకి అక్రమంగా రేషన్ బియ్యం రవాణ చేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు అంటూ మండిపడ్డారు.

ఎమ్మెల్యే కొండబాబుకి కూడా పవన్ కల్యాణ్ చురకలు అంటించారు. లోకల్ ఎమ్మెల్యే కూడా కాంప్రమైజ్ అయితే ఎలా అంటూ ప్రశ్నించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోర్టు అధికారులపై చర్యలు తప్పవన్నారు పవన్ కల్యాణ్. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడ పోర్టులో తనిఖీలు నిర్వహించారు.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుక్రవారం కాకినాడ పోర్టు పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. పోర్టు కార్యకలాపాలు ఏ విధంగా కొనసాగుతున్నాయో పరిశీలించారు. ఇప్పటివరకు అధికారులు సీజ్ చేసిన అక్రమ రేషన్ బియ్యాన్ని గుర్తించారు. రేషన్ బియ్యాన్ని ఏ విధంగా ఎక్స్ పోర్టు చేస్తున్నారు అనే అంశంపై జిల్లా అధికారులు, కలెక్టర్ ను పవన్ కల్యాణ్ అడిగి తెలుసుకున్నారు.

స్థానిక ఎమ్మెల్యే కొండబాబుపై పవన్ కల్యాణ్ కొంత సీరియస్ అయ్యారు. మీరు ఎందుకు కాంప్రమైజ్ అవుతున్నారు, కాంప్రమైజ్ కావాల్సిన అవసరం ఏముంది, మనం పోరాటం చేసింది దీనికోసమేనా అని ఎమ్మెల్యే కొండబాబును పవన్ కల్యాణ్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. రేషన్ బియ్యం అక్రమ రవాణ వ్యవహారంలో ఇటు అధికారులు, అటు ప్రజాప్రతినిధుల తీరుపై పవన్ కల్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే రేషన్ బియ్యం అక్రమ రవాణ కాకినాడ పోర్టు నుంచే జరుగుతోందన్న సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో రేషన్ బియ్యం అక్రమ రవాణ వ్యవహారంలో స్వయంగా పవన్ కల్యాణ్ రంగంలోకి దిగారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన చేశారు. రేషన్ బియ్యం అక్రమ రవాణ చేస్తే ఊరుకునేది లేదని గతంలోనూ పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ఎవరున్నా, ఎంతటి వారున్నా వదిలేది లేన్నారు. ఆ దిశగా పవన్ కల్యాణ్ చర్యలను వేగవంతం చేశారని చెప్పుకోవచ్చు.

Also Read : రాజ్యసభకు నాగబాబు? పెద్దల సభకు వెళ్లే ఆ ముగ్గురు అదృష్టవంతులు వీరేనా?