Gossip Garage : రాజ్యసభకు నాగబాబు? పెద్దల సభకు వెళ్లే ఆ ముగ్గురు అదృష్టవంతులు వీరేనా?
టీడీపీ ఆవిర్భావం నుంచి రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకపోవడం ఇదే తొలిసారి. ఇప్పటికి తొమ్మిది నెలలుగా పెద్దల సభలో టీడీపీ ప్రాతినిధ్యం లేదు.

Ap Rajya Sabha Race (Photo Credit : Google)
Gossip Garage : మూడు పార్టీలు..ఎందరో ఆశావహులు. యోగం దక్కేది మాత్రం ముగ్గురికే. అందుకే పెద్దల సభకు వెళ్లే ఆ అదృష్టవంతులు ఎవరనేది కూటమిలో హాట్ టాపిక్‌గా మారింది. వైసీపీ రాజ్యసభ సభ్యులుగా ఉన్న ముగ్గురు రిజైన్ చేయడంతో మూడు స్థానాలు ఖాళీ అయ్యాయి. ఆ మూడు సీట్లలో ముగ్గురికి అవకాశం దక్కడం ఖాయం. కానీ ఆ ముగ్గురు ఎవరన్నదే డిస్కషన్ పాయింట్ అవుతోంది. టీడీపీ నుంచే ముగ్గురు రాజ్యసభకు వెళ్తారని ఓ చర్చ.. జనసేనకు కూడా ఓ సీటు ఇస్తారని ఇంకో టాక్ వినిపిస్తోంది. పెద్దల సభకు వెళ్లే ఆ ముగ్గురు ఎవరు.? బాబు మదిలో ఏముంది.? ఆశావహులు అంచనాలేంటి.?
రాజ్యసభ సీటు కోసం టీడీపీలో భారీగా ఆశావహులు..
ఏపీలో ముచ్చటగా మూడు రాజ్యసభ సీట్లు ఖాళీ అయ్యాయి. ఈ మూడు వైసీపీ గెలుచుకున్నవే. ఫ్యాన్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్య రాజీనామా చేయడంతో మూడు సీట్లకు బైపోల్ వచ్చింది. అసెంబ్లీలో ఎమ్మెల్యేల బలం ఉన్న కూటమి ఈ మూడు రాజ్యసభ సీట్లను దక్కించుకోవడం పక్కా. అయితే కూటమిలో మూడు పార్టీలు ఉండటం.. మూడు రాజ్యసభ సీట్లు ఖాళీగా ఉండటం ఆసక్తికరంగా మారింది. ఆ ముగ్గురి రాజీనామాతో ఖాళీ అయిన మూడు సీట్ల కోసం కూటమిలో ముఖ్యంగా టీడీపీ నుంచి ఆశావహులు భారీగా ఉన్నారు. పలువురు సీనియర్ నేతలు రాజ్యసభ స్థానం కోసం ఎప్పటి నుంచో వేచి చూస్తున్నారు.
బీద మస్తాన్ రావుకి మళ్లీ అవకాశం ఇస్తారని ప్రచారం ..
మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో ఖాళీ అయిన స్థానం ఇంకా 20 నెలలు మాత్రమే మిగిలి ఉంది. బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్యల రాజీనామాతో ఖాళీ అయిన స్థానాలు మాత్రం మూడు సంవత్సరాలపైన కాలపరిమితి ఉంది. ఈ ముగ్గురిలో బీద మస్తాన్ రావుకి మళ్లీ అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఎమ్మెల్సీ పదవి కోసం వెయిట్ చేస్తున్న కొందరు నేతలు కూడా ఇప్పుడు..రాజ్యసభ ఉపఎన్నికల షెడ్యూల్ రావడంతో వీటికి కూడా ట్రై చేస్తున్నారు. మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు..చివరి నిమిషంలో టికెట్ వదులుకున్న మాజీ మంత్రి దేవినేని ఉమా వంటి నేతలు రాజ్యసభ రేసులో ఉన్నారు.
కడప జిల్లాకు చెందిన నేత, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి కూడా పెద్దల సభకు వెళ్లాలని ఆశ పడుతున్నారు. మాజీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్, కంభంపాటి రామ్మోహన్ రావు తాము పార్టీకి చేసిన సేవలను గుర్తించి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.
గల్లా జయదేవ్‌ను రాజ్యసభకు పంపిస్తారని టాక్..
మూడు పార్టీల మధ్య పొత్తు ఉన్న నేపథ్యంలో ఈ మూడు పదవులను మూడు పార్టీలు తలా ఒకటి తీసుకుంటాయా.? లేకు టీడీపీనే మూడు పదవులు తీసుకుంటుందా అనే ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే ఖాళీ అయిన మూడు రాజ్యసభ పదవుల్లో రెండు టీడీపీకి, ఒకటి జనసేనకు కేటాయిస్తారని ప్రచారం నడుస్తోంది. సైకిల్ పార్టీకి దక్కే ఆ రెండు సీట్లలో ఒకటి మాజీ మంత్రి అశోక్ గజపతి రాజుకు ఇస్తారని తెలుస్తోంది. ఆయన పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీలోనే కొనసాగుతున్నారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన ప్రతిసారి మంత్రి అయ్యారు. 2014లో మాత్రం కేంద్రమంత్రి అయ్యారు. ఈ ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. అందుకే ఆయనను పెద్దల సభకు పంపిస్తారని అంటున్నారు. గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్‌ను రాజ్యసభకు పంపిస్తారని కూడా టాక్ వినిపిస్తోంది.
2014, 2019లో గుంటూరు ఎంపీగా గెలిచిన గల్లా జయదేవ్..వైసీపీ పాలనలో ఇబ్బందులను ఫేస్ చేయడంతో..ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. ఆయన సూచించినట్లుగా గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి పెమ్మసాని చంద్రశేఖర్‌కు టికెట్ ఇచ్చింది టీడీపీ. దాంతో ఇప్పుడు గల్లా జయదేవ్‌కు రాజ్యసభకు పంపే ఆలోచనలో కూడా పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది.
జనసేనకు ఓ సీటు ఇస్తే నాగబాబు పెద్దల సభకు వెళ్లడం పక్కా.!
మరోవైపు జనసేనకు ఒక రాజ్యసభ సీటు ఇస్తారని తెలుస్తోంది. అదే జరిగితే జనసేనాని బ్రదర్ నాగబాబు పెద్దల సభకు వెళ్లడం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. ఎన్నికల్లో జనసేనతో పాటు కూటమి గెలుపు కోసం నాగబాబు కృషి చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే నాగబాబుకు టీటీడీ ఛైర్మన్ ఇస్తారన్న ప్రచారం సాగింది. అయితే ఇప్పుడు జనసేనకు రాజ్యసభ సీటు ఇస్తే మాత్రం..అది నాగబాబుకు దక్కడం ఖాయమని తెలుస్తోంది. నాగబాబు రాజ్యసభకు ఎన్నికైతే జనసేన నుంచి తొలి ప్రాతినిధ్యం ఆయనదే అవుతుంది.
9 నెలలుగా పెద్దల సభలో టీడీపీకి లేని ప్రాతినిధ్యం..
మరోవైపు టీడీపీ ఆవిర్భావం నుంచి రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకపోవడం ఇదే తొలిసారి. ఇప్పటికి తొమ్మిది నెలలుగా పెద్దల సభలో టీడీపీ ప్రాతినిధ్యం లేదు. మొత్తం 11 ఎంపీ సీట్లూ వైసీపీ ఖాతాలోకే వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఈ మూడు సీట్లు ఖాళీ కావడంతో అందులో ఈసారి ఇద్దరు రాజ్యసభ సభ్యులను పంపించి టీడీపీ వాయిస్‌ను వినిపించాలని చూస్తోంది హైకమాండ్. మరోవైపు బీజేపీ కూడా ఏపీ నుంచి రాజ్యసభ సీటు అడిగే అవకాశం ఉంది.
అయితే మున్ముందు ఖాళీ అయ్యే సీట్లలో అవకాశం ఇస్తామని..ఈసారి మాత్రం టీడీపీ, జనసేనకు విడిచి పెట్టాలని ఆ రెండు పార్టీలు బీజేపీ హైకమాండ్‌ను కోరినట్లు తెలుస్తోంది. సో ఆశావహులు..అంచనాలు ఎలా ఉన్నా..పెద్దల సభకు వెళ్లే ఆ ముగ్గురు ఎవరనేది మరో వారం పది రోజుల్లోనే క్లారిటీ వచ్చి అవకాశం ఉంది.
Also Read : భవిష్యత్తులో రాజధానిని మార్చే అవకాశం లేకుండా కూటమి సర్కార్ మాస్టర్ ప్లాన్..!