ధర్మాన ప్రసాదరావు ఎందుకు సైలెంట్ అయినట్లు?

త్వరలో కార్పొరేషన్‌ ఎన్నికలు వస్తుండటంతో తమ నాయకుడు సైలెంట్‌గా ఉంటే ఎలా అని చర్చించుకుంటున్నారట క్యాడర్.

ధర్మాన ప్రసాదరావు ఎందుకు సైలెంట్ అయినట్లు?

Dharmana Prasada Rao

Updated On : October 16, 2024 / 8:15 PM IST

ధర్మాన ప్రసాదరావు. నాన్ కాంట్రవర్సీ లీడర్. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి మొదలు.. వైఎస్ జగన్‌ వరకు అనేక మంది సీఎంల క్యాబినెట్‌లో కీలక శాఖలు నిర్వహించారు. నాలుగు దశాబ్ధాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన ధర్మాన.. హోదా, స్థాయి, గౌరవానికి తగ్గట్లుగా.. సాదాసీదాగా పని చేసుకుంటూ వెళ్తుంటారు.

అధికారంలో ఉన్నా.. అపోజిషన్‌లో ఉన్నా హుందాగా వ్యవహరిస్తుంటారు. అయితే మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన సైలెంట్ అయిపోయారు. అప్పుడూ, ఇప్పుడూ ఎప్పుడూ ధర్మాన అగ్రేసివ్ పాలిటిక్స్‌కు దూరంగా ఉంటారు. ప్రత్యర్థులపై అనవసరంగా నోరు పారేసుకోరు. దీంతో ఆయనకు రాజకీయంగా కూడా శత్రువులు తక్కువే. అలాగని విధానపరంగా ఎవరినీ విమర్శించకుండా విడిచి పెట్టరు ధర్మాన.

వైసీపీ హయాంలో విశాఖ రాజధాని నినాదం నెత్తిన పెట్టుకుని మరీ మోశారు. అవసరమైతే ప్రాణత్యాగాలకు కూడా సిద్దమంటూ ప్రకటించారు. అలాంటి సీనియర్ నేత ఇప్పుడు మౌనంగా ఉండిపోవడం కార్యకర్తలకు కూడా నచ్చడం లేదట. ధర్మాన ప్రసాదరావు అంటే ఏదో ఒక నియోజకవర్గానికి పరిమితమైన నాయకుడు కాదు.

 2024 ఎన్నికల ముందే చెప్పిన ధర్మాన
ఆయన కనుసన్నల్లోనే సిక్కోలు రాజకీయాలు నడుస్తూ వచ్చేవి. ఇప్పుడు ప్రతిపక్షంలో పార్టీని ముందుకు నడిపించాల్సిన సమయంలో ఆయన మౌనం ద్వితీయ స్థాయి నేతలకు అంతు పట్టడం లేదట. సార్ ఇలా వచ్చి కనబడిపోతే చాలు శ్రీకాకుళం నియోజకవర్గ వైసీపీలో మళ్లీ జోష్‌ వస్తుందని అనుకుంటున్నారట. 2024 ఎన్నికల ముందే ప్రత్యక్ష రాజకీయాల నుంచి దూరంగా ఉండాలనుకుంటున్నట్లు చెప్పారు ధర్మాన.

కానీ అధినేత ఒప్పుకోలేదని మరోసారి బరిలో నిలవాలని చెప్పారంటూ ఎన్నికల సభలలో చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు ధర్మాన.

వైసీపీ అధినేత జగన్ నిర్వహించిన శ్రీకాకుళం జిల్లా సమీక్షా సమావేశాలకు కూడా ధర్మాన ప్రసాదరావు అటెండ్ కాలేదు. తన సోదరుడు కృష్ణదాస్ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమానికి కూడా ధర్మాన ప్రసాదరావు హాజరు కాలేదు. అన్నివర్గాల్లో మంచి పేరున్న ధర్మాన జిల్లా రాజకీయాల్లో యాక్టివ్‌గా లేకపోవడం క్యాడర్‌ను, లీడర్లను నిరాశలో పడేసిందట.

రాం మనోహర్ నాయుడు కూడా అంతే..
ధర్మాన ప్రసాదరావు పూర్తిగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నారా లేక సరైన సమయంలో యాక్టివ్‌ కావాలనుకుంటున్నారా అంటూ పార్టీలో చర్చ సాగుతుంది. ఇక ధర్మాన ప్రసాదరావు కుమారుడు రాం మనోహర్ నాయుడు కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

త్వరలో కార్పొరేషన్‌ ఎన్నికలు వస్తుండటంతో తమ నాయకుడు సైలెంట్‌గా ఉంటే ఎలా అని చర్చించుకుంటున్నారట క్యాడర్. అయితే ధర్మాన అంటే సైలెంట్‌ పాలిటిక్స్. ఎలాంటి హడావుడి లేకుండా రాజకీయాలను చక్కబెట్టడంలో ఆయన రూటే సెపరేటు. అందుకే తమ నేతకు ఏదో ఓ ప్లాన్ ఉండే ఉంటుందని అనుకుంటున్నారట కార్యకర్తలు. కానీ తమ నాయకుడి మదిలో ఏముందో తెలుసుకోలేక పోతున్నారట.

కొండా దూకుడుతో హస్తం పార్టీకి తలనొప్పులు.. ఒకటి ముగియకముందే మరో వివాదం