క్యాస్ట్‌ పాలిటిక్స్‌కు పవన్‌ క్లాప్‌ కొట్టారా?

క్యాస్ట్‌ పాలిటిక్స్‌కు పవన్‌ క్లాప్‌ కొట్టారా?

Updated On : January 30, 2021 / 10:49 AM IST

Did Pawan kalyan clap for caste politics? : ఏపీ రాజకీయాల్లో జనసేనది ఓ భిన్నమైన సిద్ధాంతం. కుల మతాలతో సంబంధం లేని రాజకీయాలు చేయడమే తమ లక్ష్యమని… పాతికేళ్ల భవిష్యత్ కోసమే తాను రాజకీయాలు చేస్తున్నట్లు పవన్‌ ఎప్పుడూ ప్రకటిస్తుంటారు. అయితే ఇప్పుడు జనసేనాని తన రూట్‌ మార్చినట్లు తెలుస్తోంది. ఫ్యాన్ బేస్ తో పార్టీ నడవదని డిసైడ్ అయిన పవన్‌ కల్యాణ్.. ఏపీ రాజకీయాలకు కుల సమీకరణ కూడా అవసరమని భావిస్తున్నారట. అందుకే బలమైన సామాజిక వర్గాలను మచ్చిక చేసుకునే పనిలో గబ్బర్‌ సింగ్ పడినట్లు తెలుస్తోంది.

పూర్తిగా మెగా ఫ్యాన్ బేస్ మీదే ఆధారపడ్డ జనసేనకు గతంలో ఆశించిన స్థాయిలో ఓట్లు దక్కడం లేదు. దీంతో పవన్ రూటు మార్చారు. ఫ్యాన్ పాలిటిక్స్ కాదు.., ఇక క్యాస్ట్ పాలిటిక్స్ కు క్లాప్ కొట్టాలని పవర్ స్టార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే తొలిసారిగా కాపు నేతలతో పవన్‌ కల్యాణ్‌ భేటీ అయ్యారు. శాసించేస్థాయిలో ఉండాల్సిన కాపులు..యాచించే స్థాయిలోనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

రాజకీయంగా, సామాజికంగా కాపు, బీసీ కులాల్లో అసమానతలున్నాయన్నారు. బ్రిటీష్‌ కాలం నుంచి కాపు సామాజికవర్గాన్ని తరతరాలుగా విభజించి పాలిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా కాపులు ఏకమై పోరాటం చేసి రాజ్యాధికారం సాధిస్తేనే…కాపులతో పాటు బీసీ కులాలు, ఎస్సీ, ఎస్టీలకు న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు.

ఏపీలో అత్యధిక జనాభా ఉన్న కులం కాపులే. కాపులు ఎటువైపు ఉంటే ఆ పార్టీదే అధికారం. స్వతహాగా కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కల్యాణ్ కు వారి ఓట్లు పెద్దగా పడలేదు. గత ఎన్నికల్లో కాపులంతా వైసీపీకి ఓట్లు వేశారని ప్రచారం జరుగుతోంది. అయితే ఏపీ జనాభాలో 27 శాతం ఉన్న కాపుల్ని ఓటు బ్యాంకుగా చూడడాన్ని ప్రతి రాజకీయ పార్టీ విరమించుకోవాలని పవన్‌ విజ్ఞప్తి చేశారు.

తుని ఘటనలో కాపులపై కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. తనకు కులాన్ని ఆపాదించవద్దన్నారు. తాను ఒక కులానికి, మతానికి, ప్రాంతానికి చెందిన వ్యక్తిని కాదన్న పవన్‌కల్యాణ్….కాపుల సమస్యల పరిష్కారం కోసం జనసేన అండగా ఉంటుందని తేల్చిచెప్పారు.