Orphan Children : అంగవైకల్యంతో అనాధలకు అండగా నిలుస్తూ… ఆకలి బాధలు తీరుస్తూ…
పేదరికం, అంగవైకల్యం... అతడిని ఆకలి బాధలకు, అవమానాలకు గురి చేశాయి. అయినా అతడు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. బతకటానికి నిరంతరం శ్రమించాడు. అంగవైకల్యం దేనికీ అడ్డంకి కాదని నిరూపించాడు.

Differently Abled Person To Orphan Children
Differently abled Person helps to Orphan Children : పేదరికం, అంగవైకల్యం… అతడిని ఆకలి బాధలకు, అవమానాలకు గురి చేశాయి. అయినా అతడు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. బతకటానికి నిరంతరం శ్రమించాడు. అంగవైకల్యం దేనికీ అడ్డంకి కాదని నిరూపించాడు. అనాధల, అభాగ్యుల ఆకలి బాధను తీర్చటం తన బాధ్యత అనుకున్నాడు. తన సంపాదనలో అధిక భాగాన్ని అందుకోసం వెచ్చిస్తున్నాడు. 36 ఏళ్ల క్రితం విజయవాడలోని రాణిగారితోటకు చెందిన ఓ నిరుపేద కుటుంబంలో పుట్టాడు దుర్గారావు. రెండేళ్ల వయస్సులో పాల కోసం ఏడుస్తున్న అతన్ని మద్యం మత్తులో ఉన్న తాత గోడకు విసిరి కొట్టాడు. దాంతో అతని నడుము భాగం దెబ్బతింది. కాళ్లు సచ్చుబడిపోయాయి. ఐదేళ్ల వయస్సులో మంగళగిరిలో వికలాంగుల స్కూల్లో తల్లిదండ్రులు చేర్పించారు.
అక్కడే 7వ తరగతి వరకూ చదివాడు. అతని చుట్టూ ఉన్నవారంతా వికలాంగులు కావడంతో బాల్యం మొత్తం సరదాగా గడిచిపోయింది. ఆ తర్వాత ఇంటికి వచ్చాడు. నడుస్తున్న జనాన్ని, పిల్లల్నీ చూసి చాలా రోజులు ఏడ్చాడు. ‘నాకు కాళ్లు ఎందుకు లేవు… ఇలా ఎన్ని ఏళ్లు నేలపై పాకుతూ నడవాలి’ అంటూ బాధపడ్డాడు. జనం, తోటి పిల్లలు అందరూ దుర్గారావుని ‘రేరు..కుంటోడా…’ అని పిలిచేవారు. చులకనగా చూసేవారు. అవి అన్నీ అతన్ని మానసికంగా దెబ్బతీశాయి. చదువు మీద శ్రద్ధ తగ్గింది. అప్పటి వరకూ క్లాస్ ఫస్ట్ ఉన్న తను లాస్ట్ బెంచ్ స్టూడెంట్‌గా మారాడు.
థర్డ్ క్లాస్‌లో పదో తరగతి పాసై… మచిలీపట్నంలోని పాలిటెక్నిక్ కళాశాలలో చేరాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల రీత్యా చదువు మధ్యలో ఆగిపోయింది. తిరిగి ఇంటికి వచ్చిన అతనికి ఉపాధి కోసం తిరగని షాపు అంటూ లేదు. ‘నీవు షాపు షటర్ ఎత్తగలవా? బరువులు లేపగలవా? ఏం చేయగలవు?’ అంటూ అవమానాలు ఎదురయ్యాయి. ట్రైసైకిల్ మీద పనికోసం వీధులన్నీ తిరిగాడు. తండ్రి కోరిక మేరకు దుర్గారావు బంధువు అయిన నాగలక్ష్మిని 2005లో పెళ్లి చేసుకున్నాడు.
”కుంటివాడిని పెళ్లి చేసుకున్నావు? నిన్ను ఏం పెట్టి పోషిస్తాడు” అని నాగలక్ష్మిని బంధువులు తిట్టారు. దాంతో అతనికి కోపంతో పాటు పట్టుదల పెరిగింది. కష్టపడి డబ్బు సంపాదించాలనుకున్నాడు. రాత్రివేళల్లో రోడ్లవెంట పడేసిన మద్యం సీసాలను సేకరించి.. ఉదయం వాటిని అమ్మి.. వచ్చిన డబ్బుతో పూల వ్యాపారం మొదలుపెట్టాడు. ఉదయం పూలు అమ్ముతూ… మధ్యాహ్నం ప్లాస్టిక్ బొమ్మలు అమ్మాడు. సంవత్సరం తర్వాత పాప (మరియకుమారి) పుట్టింది. ఆమెకి గుండెలో రంధ్రం ఉందని, మందులు వాడాలని వైద్యులు చెప్పారు. పెద్దయ్యాక ఆపరేషన్ చేయాలని సూచించారు. దాంతో మరింత కష్టపడాలనుకున్నాడు.
పూలు, బొమ్మలు అమ్ముతూనే అర్ధరాత్రి వేళ బెంజిసర్కిల్ వద్ద టీ, సిగిరెట్లు, బీడీలు అమ్మాడు. ఆ వచ్చిన డబ్బుతోనే ఇల్లు గడిచేది. ఒక్కోరోజు పనిచేయలేక రోడ్లవెంట అడుక్కున్నాడు. ఫుట్‌పాత్ మీద అన్నం తిన్నాడు. మిగిలినదాన్ని ఇంటికి తెచ్చి భార్య పిల్లలకీ పెట్టేవాడు. ఇలా కష్టపడుతుండగానే శ్వాసకు సంబంధించిన లోపంతో రెండో పాప (థెరిస్సా) పుట్టింది. కుటుంబ పోషణ మరింత భారంగా మారింది. ఇలా మూడు పనులు కాకుండా ఒకే పని చేయాలనుకున్నాడు. రామలింగేశ్వరపురంలో పడవలరేవు మార్కెట్ వద్ద పని దొరికింది. కిలో పచ్చిరొయ్య పొట్టు వలిస్తే రూ.10 ఇచ్చేవారు.
అదే దుర్గారావు జీవితంలో ఒక మలుపునకు కారణం అయింది. అబ్బాయి కోసం ఎదురుచూసిన వారికి మూడోసారి కూడా అమ్మాయి పుట్టింది. ముగ్గురు బిడ్డల్ని కష్టపడి చదివించాలనుకున్నాడు. తానే స్వయంగా చేపలు, రొయ్యలు అమ్మడం మొదలుపెట్టాడు. ఫైనాన్స్‌లో త్రీవీలర్ బండిని తీసుకున్నాడు. ఒక్కో కిలో చొప్పున చేపలు, రొయ్యలు కొనుగోలు చేసి ప్రతిరోజూ అమ్మేవాడు. రోజురోజూకి తన వ్యాపారం పెంచుకుంటూ ఆటోలో సరుకుని గుంటూరు తీసుకెళ్లి ఒకచోట పెట్టుకుని అమ్ముకునేవాడు. కిలోతో ప్రారంభించిన వ్యాపారం ఇప్పుడు క్వింటాళ్ల చొప్పున సాగుతుంది.
విజయవాడలోని బస్టాండ్, రైల్వేస్టేషన్, గుణదల, ప్రభుత్వ ఆసుపత్రి, నగరంలోని ప్రతి వీధి బండిమీద తిరుగుతూ అనాధలకు 300, 400 అన్నం పొట్లాలు ఇస్తున్నాడు. ఒక్కో రోజు గుంటూరు, మంగళగిరి, పెనగంచిప్రోలు ప్రాంతాల్లో తిరిగి అనాధలకు అన్నం పెడుతున్నాడు. వస్తున్న ఆదాయం మొత్తం ఇలా ఖర్చు పెట్టడం చూసి కుటుంబ సభ్యులు అడ్డుచెప్పారు. తన వెంట ఇంట్లోవారిని కూడా తన బండిమీద తీసుకెెళ్లాడు. రోడ్లమీద అన్నం కోసం దీనస్థితిలో ఉన్న వారిని చూసి వారూ కంటనీరు పెట్టారు. దుర్గారావు చేస్తున్న పనికి తమ వంతు సహకారం అందిస్తున్నారు.
అన్నదానం చేయడమే కాదు… ప్రతి నెలా తనకు వచ్చే పెన్షన్ డబ్బుతో వికలాంగులకు వ్యాపారం చేసుకోమని బతుకుదెరువు చూపిస్తున్నాడు. తాడేపల్లిలోని క్రిస్టియన్ పాలేనికి చెందిన ఓ వికలాంగురాలికి కూరగాయల షాపు పెట్టుకునేందుకు సహాయం చేశాడు. అంధులకు వైద్యసహాయం, వృద్ధులకు దుప్పట్లు, రోగులకు పండ్లు నిత్యం పంచిపెట్టడం చేస్తున్నాడు. రోడ్లు వెంట పాక, గుడిసెలో ఉంటున్న వారికి నిత్యావసరుకులు తీసుకెళ్లి ఇస్తున్నాడు. పిల్లల వైద్యం కోసం దాచిన రూ.7 లక్షలను లాక్‌డౌన్ సమయంలో ఖర్చు పెట్టి 9 నెలల పాటు పేదలకు అన్నం పెట్టి ఆదుకున్నాడు. ఇలా దుర్గారావు చేస్తున్న సేవాకార్యక్రమాలను సోషల్ మీడియాలో చూసిన తెలంగాణా మంత్రి కొప్పుల ఈశ్వరావు పిలిచి మరీ సన్మానం చేశారు.